సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైన ఐటీసీ పేపర్ బోర్డు సీఈవో వాదిరాజ్ కులకర్ణి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా కమలాపూర్‌లోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను పునరుద్ధరించే అంశంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఎండీ హార్దిక్ పటేల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
బిల్ట్ ఆస్తులు ప్రస్తుతం ఫిన్‌క్వెస్ట్ సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఎండీతో, బిల్ట్ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితోనూ చర్చలు జరిపారు. 2014లో ఆ మిల్లు మూతపడడం వల్ల దాదాపు 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని వారికి ఉపాధి కల్పించడంతోపాటు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని కోరారు.
ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment