సాక్షి, హైదరాబాద్: తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కమలాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తుపై స్టే విధించాలంటూ వేసిన ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు.సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ సంజయ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పరీక్షకేంద్రంలోకి ఎవరూ వెళ్లకుండా చూసుకోవాల్సిన ప్రధానోపాధ్యాయుడు ఆ పని చేయకుండా బండిపై ఫిర్యాదు చేయడానికి మాత్రం ఉత్సాహం చూపించారన్నారు.
41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయకుండా సంజయ్‌ను అరెస్టు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ సంజయ్ ఈ కేసులో ఇతర నిందితులతో కలిసి కుట్రపన్నారని, ఆయన అరెస్టు తర్వాత ఎలాంటి ప్రశ్నపత్రాల లీకేజీ జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీని ప్రేరేపించడం, ప్రోత్సహించడం చట్టప్రకారం తీవ్రమైన నేరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment