ప్రజల రుణం తీర్చుకోవడమే నా ఎజెండా
కమలాపూర్‌ను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేస్తా
ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్
కమలాపూర్ : ముక్కూ, ముఖం తెలియని నాడు అండగా ఉండి ఇంతగా ఆశీర్వదించిన మండల ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఎజెండా అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పర్యటించి రూ.2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కమలాపూర్‌ను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన తర్వాత మొద టి సారిగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు తీసిపోని విధంగా విద్య, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా సీడ్ బౌల్ అఫ్ తెలంగాణలో భాగంగా కమలాపూర్ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
ఇప్పటికే మండలానికి హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వచ్చిందని, బీపీసీఎల్, ఐఓసీ ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ)రాకముందే కమలాపూర్‌లో రూ.20 కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మించి దానిని మిషన్ భగీరథకు అనుసంధానం చేసి 2018 లోగా మండల ఆడబిడ్డలకు కానుకగా ఇంటింటికి నల్లా ఇస్తానన్నారు. గతంలో వాగులపై బ్రిడ్జిలు లేక వర్షం వస్తే మండలం ఐలాండ్‌గా మారేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా మండల వ్యాప్తంగా రూ.40 కోట్లతో 10 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. రూ.170 కోట్లతో హుజూరాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్‌లేన్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసమే వరంగల్‌లోకి..
కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉంద ని, నిత్యం మండల ప్రజలు ఏ పని కోసమైనా వరంగల్‌కే వెళ్తారని, ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యానికే మం డలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలి పామని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై మండల ప్రజలు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ త్వరలో అంతా సర్దుకుంటుందన్నారు.