జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారనే ఆరోపణలతో అదుపులోకి..
హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా అరెస్టు
కరీంనగర్‌కు తరలించిన పోలీసులు..
ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి హైదరాబాద్/సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ క్రైం: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.
మూడు కేసులు నమోదు..
కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
బీఆర్‌ఎస్ నేతల ఆందోళన.. హైడ్రామా..
కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్‌ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
సమాధానం చెప్పలేకే అణచివేత: కేటీఆర్
రైతు రుణమాఫీని ఎగవేసి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేక సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అక్రమం, అత్యంత దుర్మార్గమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్‌ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది. సీఎం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎంపై చర్య తీసుకోవాల్సిందిపోయి, ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
వెంటనే విడుదల చేయాలి: హరీశ్‌రావు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశి్నస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్‌ఎస్ పార్టీ బెదరదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంజయ్ దురుసుగా మాట్లాడారు: గంగుల
కరీంనగర్: సమీక్షా సమావేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటికి లాక్కెళ్లారని.. ఆయనే గొడవకు కారణమంటూ అక్రమ కేసులు పెట్టడం ఏమిటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లోని తన నివాసంలో సోమవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక సమావేశానికి ఆహ్వనిస్తేనే నేను, కౌశిక్‌రెడ్డి వెళ్లాం. సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే సంజయ్ తన పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డిని మాటలతో అసహనానికి గురిచేశారు. దీనితో ఆగ్రహించిన కౌశిక్‌రెడ్డి ముందు నీది ఏ పార్టీనో చెప్పి ప్రసంగించాలని నిలదీశారు.
ఈ సమయంలో కౌశిక్‌రెడ్డిపైనే సంజయ్ దురుసుగా ప్రవర్తించారు’’ అని తెలిపారు. అక్కడే ఉన్న మంత్రులు దీనిని అడ్డుకోకపోగా.. క్షణాల్లో వచ్చిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లి బయటకు నెట్టేశారని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా..: ఎమ్మెల్యే సంజయ్
గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్, కేటీఆర్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాడి చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఆయన కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి తన హక్కులకు భంగం కలి్పంచారని, చేతిపై కొట్టారని, అవమానించారని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి కౌశిక్‌రెడ్డి ఒక్కడి పనేనా, ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? అనేది తెలియాలన్నారు.
కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
కరీంనగర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుమతి మేరకు తాను మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తనను తోసివేశారని, దాడికి యత్నించారని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment