మంగళవారం బీఆర్‌ఎస్ ‘కరీంనగర్ కదనభేరి’ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్
కరీంనగర్ కదనభేరిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
మూడు నెలల్లో సీఎం తొమ్మిదిసార్లు ఢిల్లీకి పోయిండు
పవర్ బ్రోకర్స్, బేవార్స్ చానళ్లు ఎప్పుడూ ఉండేవే
తగిలింది చిన్న దెబ్బ.. ఓర్చుకుని తట్టుకుందాం
ఎన్నికల్లో బ్రేక్ కొట్టకపోతే సగం దేశానికి అగ్గి పెట్టేవాడిని
సీఎం భాషతో తెలంగాణ సమాజానికి గౌరవం వస్తుందా
బయటకు పోయినోళ్లే సలాములు కొట్టుకుంటూ తిరిగొస్తారు
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే చిల్లర రాజకీయాలా!
ఇప్పుడే సాగునీరు లేక పంటలు తగలబెట్టుకుంటే ఏప్రిల్, మే నెలల్లో పంట పొలాల సంగతేంటి
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ‘ఎక్కువ పథకాలు వస్తాయనే ఆశతో కాంగ్రెస్‌కు.. తమాషాకు ఓటు వేస్తే వాళ్లు మాత్రం పదవులకు ఎక్కి దౌర్జన్యం, దోపిడీ చేస్తూ డబ్బు మూటలు గుంజుతున్నరు. ఢిల్లీకి సూట్ కేసులు పంపే పనిలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీగా ఉన్నరు. మూడు నెలల్లో ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు ఢిల్లీకి పోయిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల గద్దల వద్ద తాకట్టుపెట్టి మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
దీనిపై ప్రజల పక్షాన్ని గళాన్ని వినిపించేందుకే బీఆర్‌ఎస్ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలి’అని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మంగళవారం ‘కరీంనగర్ కదనభేరి’పేరిట బీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ ఎస్సార్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పలు తాజా రాజకీయ అంశాలపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
తల మాసినోళ్ల దొంగ ప్రచారంతో భయపడొద్దు
‘పవర్ బ్రోకర్స్, కొన్ని బేవార్స్ ఛానళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడో చోట ఒక్కరో ఇద్దరో తలకు మాసినోళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్లి బీఆర్‌ఎస్ ఖతమైందని ప్రచారం చేస్తున్నారు. దొంగ ప్రచారాలకు భయపడకుండా ముందుకు సాగుదాం.. మీ బేవార్స్ ప్రచారాలు ఆపేయండి. కొద్ది రోజుల్లో మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. నలుగురు పోతే పోయేదేమీ లేదు. ప్రజాశక్తిని కూడదీసి అద్భుత విజయాలు సాధించి తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. గులాబీ జెండా ఎన్నడూ ఖతం కాదు. భూమి, ఆకాశం ఉన్నంత కాలం ఈ గులాబీ జెండా ఉండటం ఖాయం.’
సగం దేశానికి చిచ్చు పెట్టేవాడిని
‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆగబట్టి బ్రేక్ కొట్టకపోతే ఈ పాటికి సగం దేశానికి అగ్గిపెట్టి చిచ్చు అంటించి మొత్తం భారతాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బతగిలింది ఫరవాలేదు.. ఓర్చుకుని తట్టుకుందాం. పేగులు తెగేదాకా కొట్టాడే శక్తి, ధైర్యం ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ అంకుశంలా ఉండాలి. బీఆర్‌ఎస్ గళమే తెలంగాణ గళం. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్‌ఎస్ బలంగా ఉండాలి. తెలంగాణ సోయి కలిగి ఉద్యమంలో పేగులు తెగేదాకా కొట్లాడినోళ్లు, చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన వారికే తెలంగాణ గురించి కడుపు నొప్పి ఉంటుంది.
తెలంగాణ సమాజానికి ఇలాంటి భాష గౌరవమా?
అధికారంలోకి వస్తే ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లను పెడతామని 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. ఆరు గ్యారెంటీలు, నీళ్లు, కరెంటు అడిగితే సీఎం పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, మానవబాంబు అవుతా అని అసహనంతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి భాష తెలంగాణ సమాజానికి గౌరవాన్ని ఇస్తుందా.
తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారిని దద్దమ్మలు, సన్నాసులు అంటూ నిలదీశా. సీఎంగా ఏనాడూ ఇలాంటి దురుసు మాటలు ఉపయోగించలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నా ఖజానా ఖాళీ, లంకె బిందెలు లేవు అని ఏనాడూ అనలేదు. కాంగ్రెస్‌కు అధికారం దక్కడంపై మాకు ఎలాంటి ఈర‡్ష్య లేదు. మంచిగా పనిచేసి మాతో పోటీ పడు’
కాళేశ్వరంపై టీవీల్లో కూర్చుని వివరిస్తా
‘మేడిగడ్డ బ్యారేజీ.. కాళేశ్వరంలోని వంద కాంపోనెంట్లలో ఒకటి. ఒకటి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం వచ్చినట్లు, దేశం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో టీవీ ముందు కూర్చుని ప్రతీ ఇంటికి వాస్తవాలు చేరేలా వివరిస్తా. మేడిగడ్డ పేరిట కేసీఆర్‌ను బదనాం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక పన్ను వదులైతే 32 పళ్లు రాలగొట్టుకుంటమా.
కాళేశ్వరంలోని 300 పైచిలుకు పిల్లర్లలో రెండు కుంగితే కేసీఆర్‌ను బదనాం చేయాలనే చిల్లర రాజకీయం జరుగుతోంది. నా కళ్ల ముందే కరెంటు, సాగునీటి సమస్యలతో రైతుల కళ్లలో నీళ్లు, పంట పొలాలకు అగ్గి పెట్టడం వంటివి చూస్తున్నా. ఇప్పుడే రైతుల పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పంట పొలాల సంగతేంటి’
4 నెలలు సమయం ఇవ్వాలకునున్నా కానీ..
‘తెలంగాణ దేశానికి తలమానికం చేయాలని ఎంతో కృషి చేశా. కరోనాలో ఖజానాలో డబ్బులు లేకున్నా రైతుబంధు ఆపలేదు. మిషన్ భగీరథ, నిరంతర కరెంటు ఇవ్వడం ఈ ప్రభుత్వంలోని చవట దద్దమ్మలకు చేతకావడం లేదు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెడతారు.
ఇప్పటికే వరి ధాన్యానికి బోనస్ బోగస్‌గా మారింది. కర్రుకాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరుగుతుంది. చెప్పుతో నిజంగానే కొడతారు. బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి నయాపైసా తేలేదు. కాంగ్రెస్‌కు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నా వారిని నిలదీయక తప్పడం లేదు.
పోలీసులకు రాజకీయాలు ఎందుకు
‘గ్రామాల్లో మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు బెదిరించడం సరికాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కొన్ని కుక్కలు మొరిగినా ఏనాడూ దౌర్జన్యాలు చేయలేదు. మేము అధికారంలో ఉన్నపుడు ఇవే దౌర్జన్యాలు చేస్తే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ మిగలేవారు కాదు’అని కేసీఆర్ హెచ్చరించారు.
2001లో తెలంగాణ కోసం పిడికెడు మందితో బయలుదేరిన తనను ఆకాశమంత ఎత్తుకు చేర్చారనీ, కార్యకర్తలే కథానాయకులై ముందుకు నడిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కులం మతం జాతి ప్రసక్తి లేకుండా తెలంగాణ జాతిగా నిలబడి కలబడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment