రసవత్తరంగా తాండూరు మున్సిపల్‌ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా తాండూరు మున్సిపల్‌ రాజకీయం

Published Tue, Jan 23 2024 6:36 AM | Last Updated on Tue, Jan 23 2024 7:42 AM

- - Sakshi

తాండూరు: మున్సిపల్‌ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్‌పర్సన్‌లు కొనసాగాలని బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్‌ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్‌పర్సన్‌ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్‌ చేస్తున్నారు.

సేకరించిన సంతకాలు
గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో చైర్‌పర్సన్‌ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్‌లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్‌ల మద్దతులో ఎలాగైనా చైర్‌పర్సన్‌ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో మొత్తం 36 మంది కౌన్సిలర్‌లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది.

ఇప్పటికే 15 మంది కౌన్సిలర్‌ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్‌లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్‌లు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్‌ కౌన్సిల్‌లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కౌన్సిలర్‌ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్‌లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

అన్నదమ్ముల పంచాయితీ
సాయిపూర్‌ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్‌లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్‌లోని 9వ వార్డు కౌన్సిలర్‌ అయిన వైస్‌ చైర్‌పర్సన్‌ దీపనర్సింహులు చైర్‌పర్సన్‌ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్‌లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్‌ చైరపర్సన్‌కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఎమ్మెల్యేకు విషమ పరీక్ష
మున్సిపల్‌ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement