
► ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేటలో బీసీ గర్జన సభ పెడతాం. సిద్ధరామయ్యను పిలుస్తాం. అక్కడే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం: సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన.
► నల్లగొండలో త్వరలోనే భారీ బహిరంగ సభ.. ప్రియాంక లేదా రాహుల్ వస్తారు. ఆ తర్వాతే ఖమ్మంలో భారీ సభ ఉంటుంది: భట్టి యాత్ర సమయంలోనే ఇంకో ప్రకటన.
► రాహుల్ ఖమ్మం వచ్చారు.. కొల్లాపూర్‌కు ప్రియాంక వస్తారు.. జూలై 20న ఖాయంగా వస్తారు.. కాదు కాదు 30న రావచ్చు... లేదు లేదు ఆగస్టు మొదటి వారంలో తప్పకుండా వస్తారు: మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక కోసం కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో చేసిన ప్రకటనలు.
► ఎన్నికలలోపు ఆరు భారీ సభలు నిర్వహిస్తాం. ఒకటి లేదా రెండు సభలకు రాహుల్ వస్తారు. ఒక సభకు ప్రియాంక, మరో సభకు ఖర్గే, ఇంకో సభకు సిద్ధరామయ్య వస్తారు: పీఏసీ సమావేశం అనంతరం చేసిన భారీ ప్రకటన.
► ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 18వ తేదీన వస్తారు. అక్కడ పేదలకు మేలు చేసే డిక్లరేషన్ చేస్తాం: మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను కలిసిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్
► చేవెళ్ల సభకు ముఖ్య అతిథిగా ఖర్గే వస్తారు. సమయం లేదు కాబట్టి 18న సభ వాయిదా వేశాం. త్వరలోనే తేదీ ప్రకటిస్తాం: మంగళవారం గాంధీభవన్ నుంచి మీడియాకు అందిన అధికారిక సమాచారం.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల సభలు, సమావేశాల గురించి దాదాపు రెండు నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా, అనధికారికంగా వెలువడిన ప్రకటనలు, మీడియాకు ఇచ్చిన లీకుల పర్వం ఇది. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలైతే వెలువడుతున్నాయి కానీ..ప్రకటించిన విధంగా అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహణలో మాత్రం పార్టీ విఫలమవుతోంది. బహిరంగ సభలను ప్రకటించడం, ఆ తర్వాత తేలిగ్గా వాయిదా వేసేయడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రివాజుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభల వాయిదాల పర్వంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎందుకీ వాయిదాలు
సూర్యాపేటలో మొదలై నల్లగొండ వరకు వచ్చి ఆ తర్వాత కొల్లాపూర్ మీదుగా జహీరాబాద్ వెళ్లి అక్కడి నుంచి చేవెళ్లకు వచి్చన కాంగ్రెస్ బహిరంగ సభల ‘వాయిదా రైలు’ఎక్కడ ఆగుతుంది? అసలు ఏ స్టేషన్‌లోనూ ఈ రైలు ఎందుకు ఆగడం లేదన్నది ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే అధిష్టానానికి, హాజరు కావాల్సిన అగ్ర నేతలకు సమాచారం ఇవ్వకుండా, వారి అంగీకారం తీసుకోకుండానే ఎడాపెడా ప్రకటనలు చేసేయడం, ఆ తర్వాత ఫలానా తేదీన తమకు సమయం ఇవ్వాలంటూ పీసీసీ, సీఎల్పీల నుంచి పార్టీ హైకమాండ్‌కు లేఖలు రాయడం, అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఢిల్లీ వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయడం, అయినా వీలుకాక పోవడంతో చివరకు వాయిదా వేయడం జరుగుతోందని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.
చదవండి: వారసులు రెడీ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా సుమారు 30 మంది
పార్టీ రాష్ట్ర నాయకుల టేకిటీజీ వ్యవహారశైలితో పాటు పార్టీ అధిష్టానం తాము ఏం చెప్పినా వింటుందనే అతి భరోసాతోనే ఇదంతా జరుగుతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ‘ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నా ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఫలానా చోట సభ పెట్టాలనుకున్నప్పుడు అక్కడి నాయకత్వంతో చర్చలు జరపాలి. సదరు ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు సమాచారమిచ్చి వారితో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలి.
తర్వాత అధిష్టానానికి సమాచారం పంపి వారి అంగీకారం తీసుకుని ప్రకటన చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సభ నిర్వహణ అంటే మామూలు విషయం కాదు కదా? అన్ని రకాలుగా పార్టీ నేతలను, కేడర్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పారీ్టలో ఆ ధోరణి ఇసుమంతైనా కనిపించడం లేదు..’అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం పార్టీలో కొనసాగుతున్న గందరగోళానికి అద్దం పడుతోంది.
చేవెళ్లలోనైనా జరుగుతుందా?
ఈ నెల 18వ తేదీన జహీరాబాద్‌లో ఖర్గే సభను రద్దు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వేదికను చేవెళ్లకు మార్చింది. చేవెళ్లలో సభ నిర్వహణ కోసం ఆ నియోజకవర్గ నేతలతో రాష్ట్ర ఇన్‌చార్జి ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు మంగళవారం సమావేశమయ్యారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తారని, 24న సభ జరిగే అవకాశం ఉందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. మరి చేవెళ్లలో అయినా కాంగ్రెస్ సభ వాయిదా పడకుండా జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.