ఎన్నికల సీజన్‌లో నాయకుల గోడ దూకుళ్ళు సహజమే. ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తుంటే ఆ పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అప్పటికే అక్కడున్న నేతలు కొత్తవారు వస్తే తమకు ప్రమాదమని ఆందోళన చెందడం కూడా సహజమే. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లి కృష్ణారావు తదితరులు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ సీట్ల లొల్లి మొదలైంది.
కర్నాటక ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య పెరుగుతుండటంతో పాలమూరు జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 30న సభ
వాయిదాలు పడుతూ వస్తున్నకొల్లాపూర్ కాంగ్రెస్ సభకు ఈనెల 30న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసిందే. ప్రియాంకగాంధీ సమక్షంలో ఈ భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు నేతలు. సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాక.. 20వ తేదీనాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది.
మరోవైపు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న జగదీశ్వర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి తమ స్వరం పెంచారు. సీనియర్ నాయకుడు మల్లురవి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావులు హాజరైన ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది.
కొల్లాపూర్ సీటు ఆయనకే.. కాదంటే
సమావేశానికి ముందు జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. గెలిచిన నాయకులు పార్టీని వదిలి పెట్టిన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ సీటు తప్పకుండా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీకి ఊపు వచ్చిన తర్వాత సీట్లకోసం పార్టీలో చేరితే సహకరించేంది లేదనే సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి కూడ స్పష్టం చేశారు. సీట్లు కేటాయింపు అనేది సర్వేల ఆధారంగానే జరుగుతుందని మల్లు రవి చెప్పినా కార్యకర్తలు వ్యతిరేకించారు.
కొల్లాపూర్‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్దానాలు తనవారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న నేత డిమాండ్ చేసినట్టు తెలుస్తోందంటూ.. జూపల్లిని ఉద్దేశించి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేమాత్రం కరెక్ట్ కాదని నాగం స్పష్టం చేశారు.
అసలు జూపల్లి ఎందుకు చేరడం..
కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు గెలుపుకోసం పనిచేయాలని నాగం జనార్థనరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగం హెచ్చరించటంతో కలకలం రేగింది. సర్వేల పేరు చెబుతున్నా జూపల్లి కృష్ణారావుకు సీటు గ్యారెంటీ లేకుండా పార్టీలో ఎందుకు చేరతాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ సీటు జూపల్లికి కేటాయిస్తే జగదీశ్వర్‌రావు సహకరించటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత పోరుకు తెరలేపుతుందని కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకగాంధీ సభ వాయిదా పడి పరేషాన్‌లో ఉన్న జూపల్లికి సీట్లలొల్లి తలనొప్పిగా మారిందట.
కూచుకుళ్లకు ముందే హామీ..
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగేళ్ళ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్సీ సీటు వదులుకుని కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఆయన తనయుడికి సీటు భరోసా ఇచ్చాకే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది.
అయితే చేరికలకు ముందే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పాలమూరు సీట్ల లొల్లిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. లేదంటే జూపల్లి చేరికపై ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా అనేది తేలాల్సి ఉంది.
-సాక్షి, పొలిటికల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment