ములుగులోని రామాంజాపూర్‌లో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్, ప్రియాంక అభివాదం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలోంచి పుట్టిన కాంగ్రెస్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ ఇది ప్రస్తుతం దొరల తెలంగాణగా మారిందని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీలు ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న సమరంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను ప్రధాని మోదీ కనుసన్నల్లో ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని అన్నారు.
కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ మూడు పార్టీలూ ఒక్కటయ్యాయని చెప్పారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కులగణన చేయనిదే సామా జిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్(ఎం) మండలం రామాంజాపూర్ నుంచి వారు కాంగ్రెస్ ఎన్నికల శంఖం పూరించారు. తొలుత రామప్ప రామలింగేశ్వరస్వామి ఆ లయంలో రాహుల్, ప్రియాంక పూజలు చేశారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత రామాంజాపూర్‌లో ఏర్పాటు చేసిన విజయ భేరి బహిరంగసభలో మాట్లాడారు.
నిరుద్యోగుల ఆత్మహత్యల బాట: రాహుల్
‘ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో మా అమ్మ సోనియాగాంధీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా తన రాజనీతిని మరువలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రభుత్వం 40 లక్షల మంది నిరుద్యోగులకు మొండిచేయి చూపడంతో వారు ఆత్మహత్యల వైపు పయనించే ప్రమాదం నెలకొంది. ఉద్యోగ ఖాళీలు నింపలేక, కుటుంబ పాలన కోసం కోసం పాటుపడే క్రమంలో 18 శాఖలు తమ చేతుల్లో పెట్టుకొని, జనాభాల్లో బీసీలు 50 శాతం ఉంటే ముగ్గురు బీసీలకు మాత్రమే కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వడం సామాజిక న్యాయాన్ని విస్మరించారనేందుకు నిదర్శనం.
ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులను నింపకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేసి పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీలు దూరదృష్టితో ఐఐటీ, ఐఎంఎ వంటి సంస్థలను నెలకొల్పితే మోదీ సర్కారు బీహెచ్‌ఈఎల్, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది..’ అని రాహుల్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ
‘తెలంగాణలో బీఆర్‌ఏస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు మిలాఖత్ అయ్యాయని, అవి ఎంఐఎంతో కలిసి ఉన్నాయనడానికి పార్లమెంటులో బీజేపీ ఏమి కోరుకుంటే బీఆర్‌ఎస్ దానికి మద్దతు పలకడమే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. బీఆర్‌ఏస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీఆర్‌ఎస్ పాలన మోదీ రిమోట్ ద్వారా నడుస్తోంది. విపక్ష నేతలందరిపై కేసులు పెట్టినా.. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ కేసులు లేవు. నన్ను మా నేతలను మాత్రం కేంద్రం వేధిస్తోంది. నా ఎంపీ సభ్వత్వాన్ని రద్దు చేసి 24 కేసులు పెట్టారు. అయినా సిద్ధాంతాలతో కూడిన లౌకిక పార్టీ కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయలేరు..’ అని రాహుల్ అన్నారు.
ఇందిరమ్మ మాదిరి చేయూతనిస్తాం..
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలు చేస్తాం. ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం. ఈ ప్రాంత ఆదివాసీలకు ఇందిరమ్మ మాదిరిగా చేయూతనిస్తాం. అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తాం..’ అని రాహుల్ హామీ ఇచ్చారు.
లూటీలు చేస్తూ దండుకుంటున్నారు: ప్రియాంకా గాంధీ
‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆశలు, అకాంక్షలు నెరవేర్చకపోగా.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో లూటీలు చేస్తూ దండుకుంటున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వం ప్రజలను సామాజిక న్యాయానికి దూరం చేసింది. భూదాన్ భూములకు రక్షణ లేకుండా ధరణి పోర్టల్‌తో స్కామ్‌లు చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తోంది. బంగారు తెలంగాణ పేరిట ప్రజల్ని మోసం చేస్తూ లక్షల కోట్లు దండుకుంటూ 50 శాతం బీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్‌ను ఆచరణలో 23కి తీసుకువచ్చారు.
దళితులకు మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దండుకున్నారు. ధరణి పోర్టల్ పెద్ద స్కామ్. డబుల్‌బెడ్ రూమ్‌లు ఇవ్వలేదు. రూ.లక్ష రుణమాఫీ చేయలేదు..’ అని ప్రియాంకా ధ్వజమెత్తారు. కర్ణాటక, రాజçస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇచ్చిన హామీలు నెరవేర్చామని, రాజస్థాన్‌లో ఉచితంగా వైద్యం హామీ కింద రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో వరి ధాన్యానికి రూ.2,500 గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు.
సంక్షేమ పాలనకు సోనియమ్మ ఆరు గ్యారంటీలు: రేవంత్‌రెడ్డి
‘కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించడానికే రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించడానికి సోనియమ్మ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2,500 అందించడానికి సోనియమ్మ మాట ఇచ్చారు. రూ.500కే సిలిండర్‌ను మీ ఇంటికి తెచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకుంది.
ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, ఉపాధి కూలీలకు రూ.12 వేలు కాంగ్రెస్ అందించనుంది. 200 యూనిట్ల వరకు ప్రతిఇంటికీ ఉచితంగా విద్యుత్ అందించనున్నాం. కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం అందించనుంది..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు.
నియంత పాలనకు చరమ గీతం పాడుదాం: భట్టి విక్రమార్క
‘రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత కేసీఆర్ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదాం. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, డి.శ్రీధర్‌రాబు, మధుయాష్కీగౌడ్, మల్లు రవి, జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప శిల్ప సంపదకు ఫిదా
వెంకటాపురం(ఎం) : రామప్ప ఆలయ శిల్ప సంపదకు రాహుల్, ప్రియాంకా ఫిదా అయ్యారు. పూజలు చేసిన తర్వాత వారు ఆలయాన్ని పరిశీలించారు. ఏ సంవత్సరంలో నిర్మించారు? రామప్ప ఆనే శిల్పి ఒక్కడే నిర్మించాడా? ఎన్నేళ్ల పాటు నిర్మించారు? అంటూ గైడ్ విజయ్‌ని ఆరా తీశారు. శిల్పాలను చూసి ముగ్ధులైన ప్రియాంకగాంధీ నంది విగ్రహాన్ని ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు. నంది విగ్రహం వద్ద వారు ఫొటోలు దిగారు.
నేడు పెద్దపల్లిలో రాహుల్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: రాహుల్‌గాంధీ బస్సుయాత్ర రెండవ రోజు గురువారం పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథనిలో రోడ్డ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామగిరి మండలంలో సింగరేణి గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో సింగరేణి కారి్మకులతో సమావేశమవుతారు. సాయంత్రం పెద్దపల్లిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడతారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని 8 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి కరీనంగర్‌లోనే బస చేయనున్నారు.
రామప్ప వయా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాహుల్, ప్రియాంకా గాందీలు బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు వారికి స్వాగతం పలికారు. రాహుల్, ప్రియాంకా వారితో కొద్దిసేపు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేత జి.నిరంజన్ గురువారం చార్మినార్ వద్ద నిర్వహించనున్న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను అందజేశారు. అనంతరం వారు హెలికాప్టర్‌లో రామప్పకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment