గురితప్పిన రాహుల్జీ బాణాలు | Sakshi Editorial On Congress Party Leader Rahul Gandhi | Sakshi
Sakshi News home page

గురితప్పిన రాహుల్జీ బాణాలు

Published Sun, Oct 22 2023 4:12 AM | Last Updated on Sun, Oct 22 2023 4:12 AM

Sakshi Editorial On Congress Party Leader Rahul Gandhi

కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సభలకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగుందని కాంగ్రెస్‌ వర్గాలు సంబర పడ్డాయి. అంతా బాగానే ఉంది గానీ, ఒక ముఖ్యమైన లోపం మాత్రం కన బడింది. మత్స్య యంత్రాన్ని కొట్టడానికి ఒక నియమం ఉన్నది. ఆ యంత్రం పైన గిరగిరా తిరుగుతుంటే కింద నీటిలో దాని నీడను చూసి పైనున్న చేపను కొట్టాలి. రాహుల్‌ పద్ధతి ఇందుకు విరుద్ధంగా కనిపించింది. ఆయన పైనున్న చేప వంక చూస్తూ నీటిలోని దాని నీడపైకి బాణాన్ని ఎక్కుపెట్టారు. ఆ బాణాన్ని వదిలితే ఏమవుతుంది? నీళ్లు కదులుతాయి గనుక కాసేపు నీడ కనిపించదు. చేప మాత్రం నిక్షేపంగా తిరుగుతూనే ఉంటుంది.

రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే అసలు ఇవ్వాల్సిన ముఖ్యమైన గ్యారంటీని విస్మరించినట్టు బోధపడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పైనా, బీఆర్‌ఎస్‌ పైనా ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన పొలికటికల్‌ నరేటివ్‌ లేదా రాజకీయ భాషణ అప్‌డేట్‌ అయినట్టు కనిపించడం లేదు. రాజకీయాల్లో గెలవాలంటే ఈ భాషణే ముఖ్యం. ఆ భాషణ కొత్త భావాలతో కూర్చి ఉండాలి. జనాన్ని ఉత్తేజ పరిచేదిగా ఉండాలి. వారికి ఊరటనిచ్చేదిగా ఉండాలి.

ఈ మూడు రోజుల రాహుల్‌ ప్రసంగాల్లోని భాషణ కంటే, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతల భాషణే మెరుగ్గా కనిపిస్తున్నది. వాళ్లలో రాజకీయ స్పష్టత ఉన్నది. వారి భాషణ కూడా అందుకు అనుగుణంగా ఉన్నది. ఆర్థికాభివృద్ధిలోనూ, సంక్షేమ రంగంలోనూ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలన ఒక విజయగాథగా గణాంకాల ఆధారంతో వారు చెప్పుకొస్తున్నారు. ఈ జైత్రయాత్రను కొనసాగిద్దామని సూటిగా సుత్తి లేకుండా, వారు సందేశాన్నివ్వగలిగారు. పరిపాలనా రథం జైత్రయాత్ర సాగించాలంటే రాజకీయ సుస్థిరత అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌ మార్కులు పడేది ఇక్కడే. వారు చెబుతున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కూడా రాజకీయ సుస్థిరత అనే ప్రధానమైన గ్యారంటీ అత్యంత అవసరం. ఈ గ్యారంటీని ఇచ్చే స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ లేదని దాని ట్రాక్‌ రిపోర్టే కుండబద్దలు కొట్టి చెబుతున్నది. 2004 ఎన్నికల నాటికే రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్‌ రాజకీయ సుస్థిరతను సాధించగలిగింది. ఫలితంగానే అభివృద్ధి – సంక్షేమాల్లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి 2009 ఎన్నికల్లో కూడా గెలవగలిగింది. ఈ ఒక్క ఛాప్టర్‌ను మూసేస్తే కాంగ్రెస్‌ కథలో మిగిలిన భాగాలన్నీ కుమ్ములాటల కథలే!

కాంగ్రెస్‌ కీచులాటల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చి అధికారం చేపట్టిన ఉదంతం తెలిసిన విష యమే. 1978–83 మధ్యకాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడం, పాలన అట కెక్కడం మూలంగా జనం మార్పు కోరు కున్నారు. 1989లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కథ పునరావృతమైంది. ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మార్చకపోయిన ట్లయితే సైబర్‌ టవర్స్‌ (హైటెక్‌ సిటీ)కి శంకు స్థాపన చేసిన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే దాన్ని పూర్తిచేసి ఉండేది. చంద్రబాబు డప్పు వాయించుకోవడానికి అవకాశమే ఉండేది కాదు.

2009 ఎన్నికల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ దురదృష్టవశాత్తు నాలుగు నెలల్లోనే చనిపోయారు. కాంగ్రెస్‌ అసలు కథ మళ్లీ మొదలైంది. ఏడాదిపాటు సీనియర్‌ నేత రోశయ్యను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి కిరణ్‌కుమార్‌ రెడ్డిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో మార్పు జరగకపోవడానికి కారణం పార్టీలో వచ్చిన ఐక్యత కాదు. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతం కావడం, రాష్ట్ర విభజన అనివార్యమని తేలడంతో ఆ పదవికి ఎవరూ పోటీపడలేదు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండుసార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రజలు కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. ఆ బాధ్యత నిర్వహణలో కూడా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొదటిసారి 21 మందిని గెలిపిస్తే చివరకు 10 మంది మిగిలారు. రెండోసారి 19 మందిని గెలిపిస్తే ఐదుగురు మిగిలారు. అధికారం అప్పజెప్పినప్పుడు కొట్లాడుకుని పరిపాలనను పడకే యించారు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే సంత బేరాలకు లొంగిపోయారు. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు ప్రజలు ఓటేయాలి?

రాజకీయ సుస్థిరతను అందిస్తామనే గ్యారంటీ కదా కాంగ్రెస్‌ పార్టీ నుంచి జనం ఆశించేది? ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీలో కనీసం డజన్‌ మంది ముఖ్యమంత్రి పదవి ఆశావహులున్నారు. ఓ ఆరేడు మందయితే గట్టి పట్టుదలతో పోటీలో ఉన్నట్టు సమా చారం. ఇటువంటి పరిస్థితిలో రాజకీయ సుస్థిరతను ఎలా ఆశించాలి! తెలంగాణ రాష్ట్ర పురోగతికి రాజకీయ సుస్థిరత ప్రాణాధారం. హైదరాబాద్‌ నగరం రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌.

గడిచిన పదేళ్లలోనే ఐదు లక్షలమందికి ఐటీ రంగంలో ఉద్యో గాలిచ్చిన నగరం. ఫార్మా తదితర రంగాల్లో ఇంకో ఆరేడు లక్షలమందికి కొత్తగా ఉపాధినిచ్చింది. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్న లక్షలాది మంది పేద కార్మికులకు కడుపు నింపుతున్న నగరం. రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం ఉపాధి రంగం మీద పడుతుంది.

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువతీ యువకులు ఐటీ కారిడార్‌లో ప్రదర్శన చేసినప్పుడు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ఉలికిపడింది ఇందుకే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా ఉపాధి రంగాన్ని ఆందోళనలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఇవ్వాల్సిన అసలైన గ్యారంటీ రాజకీయ సుస్థిరత.

దాని ట్రాక్‌ రికార్డ్‌ దృష్ట్యా నామ్‌కే వాస్తే హామీ ఇస్తే జనం నమ్మరు. జనాన్ని నమ్మించడానికి ఏం చేయాలో ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆరు గ్యారంటీల గురించి జనం ఆలోచిస్తారు. ఈ ఆరు గ్యారంటీల్లో కొన్ని పాత పథకాలే. వేలంపాటలో పెంచినట్టు కేటాయింపులను కొంచెం పెంచి కొత్త పథకాలుగా స్టాంప్‌ వేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ‘విద్యావికాసం’ అనే కొత్త పేరు పెట్టారు.

గృహిణులకు 2,500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించిన విధానాలను అధికారంలోకి వస్తే అప్పుడు తయారు చేస్తారట! కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్న ఈ పథకం అక్కడే ఇంకా బాలారిష్టాలను దాటలేదు.రాజకీయ సుస్థిరత అనే గ్యారంటీ ఇవ్వలేని పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలకైనా... పన్నెండు గ్యారంటీలకైనా విలువ లేదు. గురితప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహంలో ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం దాని రాజకీయ భాషణ. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు నిత్యం చేస్తున్న విమర్శలనే ఈ మూడు రోజుల్లో రాహుల్‌ గాంధీ వల్లెవేశారు. ‘కాళేశ్వరం’లో లక్ష కోట్ల అవినీతి జరిగింది.

కుటుంబ పెత్తనం నడుస్తున్నది. ‘ధరణి’ పేరుతో వేలాది ఎకరాలు కబ్జా పెడుతున్నారు. ‘దొరల తెలంగాణ’గా మార్చారు. సామాజిక న్యాయం కరువైంది. బీఆర్‌ఎస్‌ బీ–టీమ్‌గా బీజేపీ పనిచేస్తున్నది. వగైరా వగైరా. వీటిలో కొన్ని ఆరోపణలు 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ కూటమి ప్రజల ముందుంచింది. అయినా ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగలిగింది. ఇప్పుడు మరోసారి చైనా యుద్ధ కాలం నాటి త్రీ నాట్‌ త్రీ రైఫిళ్లను, డబ్బా ట్యాంకులను తీసుకొచ్చి కాల్పులు జరుపుతున్నారు.

ఈ ప్రచారంలో రాహుల్‌ గాంధీకి బాగా నచ్చిన మాట... దొరల తెలంగాణకూ, ప్రజల తెలంగాణకూ మధ్య పోరాటం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర్నుంచి రాహుల్‌ కాపీ కొట్టినట్టున్నారు. రాష్ట్రంలో పేదలకూ, పెత్తందార్లకూ మధ్యన యుద్ధం జరుగుతున్నదని జగన్‌ మోహన్‌రెడ్డి పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందుకు అక్కడ సహేతుకమైన కారణం ఉన్నది. ప్రాతిపదిక ఉన్నది. పేదల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అక్కడి పెత్తందారీ శక్తులు తెలుగుదేశం రాజకీయ కూటమి రూపంలో అడ్డుకుంటున్నారు.

యెల్లో మీడియా రూపంలో అడ్డుకుంటున్నారు. రకరకాల వేదికల పేర్లతో అడ్డుకుంటున్నారు. కేవలం రాజకీయ విమర్శలతోనే ఆటంకాలు సృష్టించలేదు. కోర్టు మెట్లెక్కి మరీ అడ్డుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించినా, సర్కారు బళ్ల ప్రమాణాలను పెంచినా, ప్రజల ఇంటి ముంగి టకు పరిపాలనను చేర్చినా, ధర్మాసుపత్రుల నాణ్యతను పెంచినా, ఊరూరా ‘రైతు భరోసా కేంద్రాల’ను తెరిచినా, 30 లక్షలమంది మహిళలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టినా సహించలేకపోయారు. వీటన్నింటి మీద కేసులు వేశారు. ఈ నేపథ్యంలో జనాన్ని జాగృతం చేయడం కోసం జరుగు తున్న కుట్రలను విడమర్చి చెప్పడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఆ నినాదాన్ని అందుకున్నారు.

ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో దొరలకు మేలు చేస్తున్నవేమిటి? పేద ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటాలేమిటి? ఆ పార్టీ దగ్గర ఉన్న పీడిత ప్రజల సాధికారతా కార్యక్రమం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల్లో దొరలు మాత్రమే లబ్ధి పొంది అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటు న్నారా? పేద కుటుంబాలకు ఈ పథకం దక్కడం లేదా? పద్దెనిమిది వందలకు పైగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు – కళా శాలల్లో ఏడున్నర లక్షలమంది దొరల బిడ్డలే నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారా? ఇటు వంటి గణాంకాలేవో ఉండాలి కదా విమర్శ చేయడానికి! అందుకు తగిన ప్రాతిపదికను చూపెట్టాలి గదా. అప్పుడే ఆ నినాదాన్ని జనం అందిపుచ్చుకుంటారు. అంతే తప్ప పదాలు బలంగా ఉన్నాయి, వాక్యం బరువుగా ఉందని ముచ్చటపడి ఔత్సాహిక కవిలా ఉత్సాహ పడితే రాజకీయాల్లో అభాసుపాలవుతారు సుమా!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక భూస్వామ్య కులంలో పుట్టాడు కనుక ఆయనది దొరల పాలన అనడం ఆమోదయోగ్యం కాదు. నిజమే, ఉత్తర తెలంగాణలోని భూస్వామ్య కులం వారు ఎక్కువమంది బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అట్లానే దక్షిణ తెలంగాణ భూస్వామ్య కుటుంబాల వారు ఎక్కువమంది కాంగ్రెస్‌లో ఉన్నారు. నాయకుల పుట్టుక కారణంగా వారు దొరల పక్షమా, పేదల పక్షమా అని నిర్ధారించగలమా? తెలుగునాట దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించినవారెవరు? పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చెన్నమనేని రాజేశ్వరరావు... వీరంతా భూస్వాముల బిడ్డలే కదా?

గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పుంజుకున్న మాట వాస్తవం. ఇందుకు కర్ణాటక ఫలితాలు కొంత దోహదపడ్డాయి. వ్యూహాలు సవరించుకొని బీజేపీ బలం పుంజుకోకపోతే అది కాంగ్రెస్‌కు మరింత మేలు చేస్తుంది. కొన్ని సీట్లు పెరగొచ్చు, కానీ పరిణామాలు కొంత భిన్నంగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు కనిపించిన వాపును బలుపుగా భ్రమిస్తే కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పదు. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్‌ బలంగా పోటీలో నిలబడాలంటే రెండు షరతులు –
1. రాజకీయ సుస్థిరతను ఇవ్వగలమన్న భరోసాను కల్పించాలి. 2. కాలాను గుణమైన, తెలంగాణ అభివృద్ధికి ఆలంబన కాగల రాజకీయ ఎజెండాను జనం ముందుంచాలి. కర్ణాటక మేనిఫెస్టో తారక మంత్రం కాదు!

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement