రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునామీ రానుంది: రాహుల్‌ | Rahul Gandhi Fires On CM KCR and BJP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునామీ రానుంది: రాహుల్‌

Published Fri, Oct 20 2023 3:55 AM | Last Updated on Fri, Oct 20 2023 3:55 AM

Rahul Gandhi Fires On CM KCR and BJP - Sakshi

గురువారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కాటారం: తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోందని, ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆరు గ్యారంటీల పథకాల అమలుపై సంతకాలు చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మీకుల ప్రయోజనాలు కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ సీఎంలా కాకుండా రాజులా పాలిస్తున్నారని, కీలక శాఖలన్నీ తన కుటుంబసభ్యుల గుప్పిట్లో పెట్టుకుని రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు. బీజేపీ, ఎంఐఎంలకు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని చెప్పారు. తెలంగాణతో తనది రాజకీయ బంధం కాదని ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధమని పేర్కొన్నారు. తనకంటే ముందు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లతో తెలంగాణకు బంధం ఉందని చెప్పారు. ఇవే మాటలు చెప్పి తన చెల్లి ప్రియాంకా గాందీని రాష్ట్ర పర్యటనకు తీసుకొచ్చానని తెలిపారు. విజయభేరి యాత్రలో భాగంగా గురువారం ఉదయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో, ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా మంథని రోడ్‌షోలో, పెద్దపల్లి బహిరంగ సభలో, కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌ కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ ప్రసంగించారు. 

దేశంలోనే నంబర్‌ 1 అవినీతి సీఎం 
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని 2004లో చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ 2014లో మాట నిలబెట్టుకుంది. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతామని తెలిసినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్‌ ఈ పదేళ్లలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. కాళేశ్వరంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది. అయినా ఎకరం కూడా తడపలేకపోయారు.

ఈ ప్రాజెక్టు వల్ల కేవలం కేసీఆర్‌ మిత్రులైన బడా కాంట్రాక్టర్లు లాభపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తెచ్చిన ధరణితో పేదల లక్షల ఎకరాలు మాయమయ్యాయి. దేశంలోనే నంబర్‌ వన్‌ అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ట్రంలో దొరల పాలనకు స్వస్తి పలకాలి. ఓ రాజు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు..’ అని రాహుల్‌ అన్నారు. 

కాంగ్రెస్‌ చేసి చూపిస్తుంది 
‘డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ అటకెక్కాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు వల్ల ఎందరికి ప్రయోజనం కలిగింది? దేశంలో బొగ్గు ధరల విషయంలో అదాని కంపెనీలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటున్నాయి. మోదీ రూ.15 లక్షలు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్‌ చెప్పినవన్నీ చేసి చూపిస్తుంది.

ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో పథకాలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం మిలాఖత్‌ అయ్యాయి. బీఆర్‌ఎస్‌ను అడ్డుపెట్టుకొని మోదీ తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రాబోతోంది. ఢిల్లీలో బీజేపీని, ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడించాలి..’ అని రాహుల్‌ పిలుపునిచ్చారు. 

కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిది 
‘దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైంది. నిత్యం ఓబీసీ ప్రయోజనాలపై మాట్లాడే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఏనాడూ కులగణన ప్రస్తావన తీసుకురారు. దేశాన్ని ఎంపీలు కాకుండా 90 మంది కార్యదర్శులు నడిపిస్తుంటారు. బడ్జెట్‌ కేటాయింపులు రూపొందించేది వారే. ఈ కేటాయింపులు జరిపే కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందిన వారున్నారు. దేశంలో మెజారిటీ వాటా ఉన్న ఓబీసీలకు రూ.44 లక్షల కోట్ల బడ్జెట్‌లో దక్కుతున్నది కేవలం 5% మాత్రమే.

అందుకే ఓబీసీ కులగణన జరగాలి. అది దేశానికి ఎక్స్‌రే లాంటిది. అది చేపడితే ప్రజలు అప్రమత్తమవుతారన్న భయంతోనే వారు కులగణనపై వెనకడుగు వేస్తున్నారు. ప్రజల పక్షాన బీజేపీపై నేనొక్కడిని ఒంటరి పోరాటం చేస్తున్నా. నా పోరాటాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాపై అక్రమంగా 24 కేసులు పెట్టింది. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి ఇల్లు కూడా లాగేసుకుంది. ఎన్ని అవరోధాలు కల్పించినా భయపడేది లేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తా..’ అని రాహుల్‌ స్పష్టం చేశారు.  

తెలంగాణ ఇవ్వకపోతే అడుక్కుతినేవారు: రేవంత్‌ 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ కుటుంబం నాంపల్లి దర్గా లేదా బిర్లా గుడి దగ్గర అడుక్కుతినే వారని విమర్శించారు. కేటీఆర్‌ అమెరికాలో బాత్రూములు కడుక్కునే వారన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

కొండా సురేఖకు గాయాలు 
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ కాన్వాయ్‌లోనే ఉండి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ బైక్‌ ర్యాలీలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఆమె స్కూటీపై వెళ్తుండగా స్కిడ్‌ కావడంతో కిందపడిపోయారు. దీంతో ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్పృహ తప్పిన సురేఖను వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

మీ బతుకుల్లో వెలుగులు నింపుతాం 
– ఆదాయ పన్ను రద్దు చేస్తాం 
– సింగరేణి కార్మీకుడి ఇంట్లో రాహుల్‌ ఆకస్మిక భేటీ 

సాక్షి, పెద్దపల్లి: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మీకుల సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రకృతికి విరుద్ధంగా, కృత్రిమ పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి పని చేస్తూ దేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మీకుల బతుకుల్లో వెలుగులు నింపుతామని వారికి భరోసా కల్పించారు. కార్మీకులకు ఆదాయ పన్ను రద్దు చేస్తామన్నారు. ప్రైవేటీకరణ కాకుండా సింగరేణిని కాపాడతామని చెప్పారు.

విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలో సింగరేణి కార్మీకులతో రాహుల్‌ సమావేశమవుతారంటూ కాంగ్రెస్‌ ప్రచార షెడ్యూల్‌ విడుదల చేసింది. దానికి తగినట్లుగా కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే రాహుల్‌ రామగిరి మండలం లద్నాపూర్‌లో ఆకస్మికంగా ఆగారు. అక్కడ సింగరేణి కార్మీకుడు పోచయ్య ఇంటికి వెళ్లారు.

సాదాసీదాగా ఇంట్లోకి వచ్చిన రాహుల్‌గాందీని చూసి పోచయ్య కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అక్కడే సుమారు 50 మంది సింగరేణి కార్మీకులతో వారి వస్త్రధారణ, నెత్తిపై టోపీతో రాహుల్‌ భేటీ అయ్యారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఆదాయ పన్ను రద్దు చేయాలి లేదా స్లాబ్‌ పెంచాలని, ప్రైవేటీకరణను ఆపివేయాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే మైన్స్‌ ప్రైవైట్‌కి కాకుండా సింగరేణికి కేటాయించాలని వారు కోరారు.

రాహుల్‌ వారికి స్పష్టమైన హామీలు ఇచ్చి భరోసా కల్పించారు. కార్మికులతో కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. సింగరేణి కార్మీకుల పోరాటం, త్యాగాలు మరువలేనివని అన్నారు.  

భరోసా కల్పించేలా హామీలిచ్చారు 
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్న వైనాన్ని వివరించాం. గతంలో 1.10 లక్షల మంది పర్మీనెంట్‌ కార్మికులు ఉంటే నేడు 45 వేల మందే ఉన్నారని చెప్పాం. మా సమస్యలన్నీ విని, మాకు భరోసా కల్పించేలా రాహుల్‌ హామీలిచ్చారు. 
– ఎ.శ్రీనివాస్, జనరల్‌ మజ్దూర్

రాహుల్‌గాంధీ వచ్చారంటే నమ్మలేకపోతున్నా.. 
మా ఇంటికి రాహుల్‌గాంధీ వస్తాడని ఊహించలేదు. ఆయన రావడం, మాఇంట్లో సమావేశం నిర్వహించడం నమ్మలేకపోతున్నా. సుమారు 40 నిమిషాల పాటు మా ఇంట్లో ఉన్నారు. మా మనవరాలికి చాక్లెట్‌ ఇచ్చారు. 
– ఓదెమ్మ, సింగరేణి కార్మీకుడి భార్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement