సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఈసారి క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సమాచారం.
టికెట్ ఆశిస్తున్న నేతలతో ఆయా జిల్లాల్లోనే సమావేశం కావడంతో పాటు నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోనుందనే చర్చ జరుగుతోంది. తనను ఇటీవల కలిసిన టీపీసీసీ నాయకుడు ఒకరితో, ఏఐసీసీ నియమించిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఈ మేరకు వెల్లడించడం గమనార్హం.
గతంలో గాందీభవన్‌లో..
టికెట్ల కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఓ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తమకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరి పేర్లను టీపీసీసీ గాందీభవన్‌లో షార్ట్‌లిస్ట్ (వడపోత) చేసి ఢిల్లీకి పంపడం, వారితో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమై మాట్లాడిన తర్వాత మళ్లీ షార్ట్‌లిస్ట్ చేయడం, ఆ తర్వాత ఏఐసీసీ ఎన్నికల కమిటీ తుదిగా అభ్యర్థులను ఖరారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2018 ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌కు వచ్చింది.
పీసీసీ షార్ట్‌లిస్ట్ చేసిన ఆశావహులతో గాంధీభవన్‌లో భేటీ అయి వారికి టికెట్ ఎందుకు ఇవ్వాలన్న దానిపై ఇంటర్వ్యూలు చేసింది. కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లనున్నట్టు, జిల్లా, నియోజకవర్గ భేటీలు జరపనున్నట్టు మురళీధరన్ వెల్లడించిన దాని ప్రకారం స్పష్టమవుతోంది. మురళీధరన్‌తో పాటు ఈ కమిటీలో ఏఐసీసీ నుంచి బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌లు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఆశావహులతో సమావేశమవుతారా? రాష్ట్ర నేతలు లేకుండా ఢిల్లీ పెద్దలే జిల్లాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరుపుతారా? అన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది.
లోక్‌సభ ఎన్నికల కసరత్తు కూడా షురూ!
ఏఐసీసీ స్థాయిలో జరుగుతున్న సమావేశాల ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది మార్చి తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తుతో పాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత వెంటనే ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయిందని ఢిల్లీలోనే మకాం వేసిన టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రస్తుతానికి రాష్ట్రంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపైనే ఏఐసీసీ దృష్టి ఉందని, ఈ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడిన తర్వాత లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కోసం ఏ క్షణమైనా తెలంగాణ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని ఆయన వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment