
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 14న ఢిల్లీలో భేటీ కానుంది. అంతకంటే ముందురోజు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోమారు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న సీఈసీ భేటీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని, దసరా తర్వాత మలి జాబితా రానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, స్క్రీనింగ్ కమిటీ సమరి్పంచిన నివేదికల ఆధారంగా సీఈసీ ఫైనల్ చేయనుంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీపై ఇప్పటికే కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 9న భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 70కిపైగా స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మిగతా స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థుల పేర్లతో జాబితాను రూపొందించింది. ఒక్కో స్థానంలో ఖరారైన అభ్యర్థుల జాబితాపై సీఈసీలో ఎలాంటి అభ్యంతరాలు లేనిపక్షంలో వాటిని యథావిధిగా ఆమోదించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే సహేతుక కారణాలను చూపి మరో అభ్యర్థిని ముందుకు తెచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఇద్దరేసి అభ్యర్థులున్న చోట్ల ఎంపిక నిర్ణయానికి సీఈసీ కొన్ని మార్గదర్శకాలు సూచిస్తుందని, వాటికనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. ఈ నెల 16 లేదా 18న తొలి జాబితా విడుదల చేసేలా ఇప్పటికే నేతల నుంచి హైకమాండ్‌కు ఒత్తిళ్లు పెరిగాయి. దానికి అనుగుణంగా వారంలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment