ఆయనో పెద్ద కబ్జాకోరు | Gaddam Ranjith Reddy vs konda | Sakshi
Sakshi News home page

ఆయనో పెద్ద కబ్జాకోరు

Published Sun, Jan 21 2024 8:20 AM | Last Updated on Sun, Jan 21 2024 8:20 AM

Gaddam Ranjith Reddy vs konda - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రంజిత్‌రెడ్డి ఓ పెద్ద కబ్జాకోరు. ఆయన ఫిలింనగర్‌లోని దేవాలయ భూమిని ఆక్రమించాడు. ఆయనపై కోళ్ల దాణా, గుడ్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. గోపన్‌పల్లి, నానక్‌రాంగూడలోనూ విలువైన స్థలాలను కొల్లగొట్టాడు. కేటీఆర్‌కు ఆయన ఓ బినామీ. ఐదేళ్లలో ఆయన చేవెళ్లకు చేసిందేమీ లేదు’ అని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం ఆరోపించారు. నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నేతలు రవికుమార్‌ యాదవ్, తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంపీగా ఆయన ధ్యాసంతా సంపాదనపైనే ఉందన్నారు.  లోక్‌సభలో ఏనాడూ చేవెళ్ల ప్రజల కష్టాలను ప్రస్తావించలేదన్నారు. 

నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని,  ఏ ఒక్క రోడ్డునూ వేయించలేక పోయారని విమర్శించారు. సొంత ఫాంహౌస్‌కు ప్రభుత్వ నిధులతో రోడ్డును వేయించుకున్నారని, ప్రస్తుతం ఈ ఫాంహౌస్‌ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చు కోకపోతే.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని  అసభ్య పదజాలంతో దూషించాడని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు హడావుడిగా రంగారెడ్డి–పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారని, పనులు పూర్తి కాక ముందే ప్రారంభించి రైతులను మోసం చేశారని చెప్పారు.

 ఇప్పటి వరకు ఒక్క 
ఎకరానికి కూడా సాగునీరు అందించలేదన్నారు. 111 జీఓ రద్దు చేసినట్లు ప్రకటించినా.. ఇప్పటికీ కోర్టుల్లో కేసు పెండింగ్‌లోనే ఉందన్నారు. శంకర్‌పల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూంల పంపిణీలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. చేవెళ్లను మున్సిపాలిటీ చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున పేదల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ప్రశ్నించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement