ఇక సార్వత్రిక సమరం
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
రాష్ర్ట విభజన అనంతరం తొలి పోరు
రాష్ట్ర భవితవ్యాన్ని మార్చనున్న ఎన్నికలు
నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
19న ఆఖరు.. అయితే 5 రోజులే అవకాశం
మండే ఎండలకు తోడు కానున్న రాజకీయ వేడి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ :కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు మార్చి 30న ముగిశాయి. రెండు విడతల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఇక కీలకమైన సార్వత్రిక ఎన్నికల ఘట్టం శనివారం నుంచి మొదలవనుంది. రాజకీయ పార్టీల దశ దిశ మార్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 5న విడుదలైంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి..
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ చాంబర్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నంద్యాల ఆర్డీఓ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.
కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు, శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఆయా నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 వరకు అవకాశం ఉన్నా 13, 14, 18వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్ల దాఖలుకు అవకాశం లేదు.
12, 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు పూర్తి కానుంది. 21న నామినేషన్లను పరిశీలన.. 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి పోటీ చేసే అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు.
ఆర్డీఓ కార్యాలయ ప్రధాన గేటుకు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉంది. నామినేషన్ సందర్భంగా ఊరేగింపులు నిర్వహించుకోవాలంటే పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే బాణసంచా పేల్చరాదనే నిబంధన విధించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఎండలు మండిపోతుండగా.. నామినేషన్ల దాఖలుకు తెర లేవడంతో రాజకీయ వేడి మరింత ఉక్కిరిబిక్కిరి చేయనుంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు విభజనకు కారణమైన పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి.