హఫీజ్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భావోద్వేగానికి గురైన తండ్రి మోయీజ్‌ఖాన్
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఆ వంశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొందిన వ్యక్తి హఫీజ్ ఖాన్ ఒక్కరే. కొడుకు పుట్టినప్పుడు కాకుండా, తండ్రికి మంచి పేరు తెచ్చినప్పుడే నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందనే నానుడి వాస్తవ రూపం దాల్చింది. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం అమరావతిలో జరిగింది. ఇందులో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తండ్రి అబ్దుల్ మోయీజ్ ఖాన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన కుమారున్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.
హఫీజ్ ఖాన్ వంశానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మేనమామ బి.షంషీర్‌ఖాన్ 1967లో కేఈ మాదన్నపై ఇండిపెండెంట్‌గా పోటీచేసి కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అలాగే 1978లో జనతా పార్టీ తరఫున బలమైన అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ హవా కొనసాగడం వల్ల ఆ పార్టీ తరఫున ఓ సాధారణ అభ్యర్థి అయిన ఇబ్రహీంఖాన్ గెలుపొందారు. హఫీజ్‌ఖాన్ తండ్రి మోయీజ్ ఖాన్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీరి వంశానికి ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్నా, గతంలో ఏ ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేదు. మొట్టమొదటి సారిగా హఫీజ్‌ఖాన్ గెలిచి రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment