సాక్షి ప్రతినిధి, కర్నూలు: సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇదే సమయంలో న్యాయస్థానం తీర్పుతో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఒకేసారి ఇన్ని ఎన్నికలు రావడంతో నాయకుల గుండెల్లో గుబులు రేగుతోంది. ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికలు సిద్ధమవుతుండగా.. అనూహ్యంగా మరో రెండు ఎన్నికలు వచ్చి పడటం గందరగోళానికి తావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలే ముందుగా నిర్వహిస్తుండటంతో ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై చూపక మానదని నాయకులు బెంబేలెత్తుతున్నారు.
ఇదే సమయంలో స్థానిక ఎన్నికల ఖర్చు ఎవరు భరించాలనే విషయంపై స్పష్టత కరువైంది. జిల్లాలో శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈనెల 30న మున్సిపల్ ఎన్నికలు, ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఆశావహులకు సర్దిచెప్పుకోలేక తలపీక్కుంటున్నారు.
ఎన్నికల మాట అటుంచితే.. అభ్యర్థుల ఎంపిక నాయకులను ఇరకాటంలోకి నెట్టుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థులకు దొరక్క కాంగ్రెస్, టీడీపీల్లో స్తబ్దత నెలకొంది. విభజనకు కారణమైన ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరూ సాహసించని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రకటనతో ఈ పార్టీలకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఒకటి రెండు చోట్ల పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని వేరొకరిని తెరపైకి తీసుకొస్తుండటంతో అలాంటి వారు రెబెల్స్‌గా మారిపోతున్నారు.
ఒకటిపై ఒకటి
Published Sat, Mar 8 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement