పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని 24 లక్షల మంది ఓటర్ల మనోగతంతో పాటు దాదాపు నెలన్నరగా తమ రాజకీయ భవితవ్యం ఏమిటని ఎదురుచూస్తున్న వివిధ పార్టీల నేతల ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో అసలు ప్రక్రియ 8.30 గంటలకు మొదలవుతుంది. ప్రతి రౌండులో పది టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫలితం రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల చొప్పున లెక్కింపు నిర్వహిస్తామన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందన్నారు. పోలింగు ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్– సీఆర్‌సీ) ఓటింగు యంత్రాల లెక్కింపు మాత్రం చివర్లో చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారమే ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు. మెజార్టీ మరీ ఎక్కువగా ఉంటే వీటి లెక్కింపు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఏయే సిబ్బందికి ఏ టేబుల్ వద్ద విధులు కేటాయిస్తారనే విషయం మాత్రం కౌంటింగ్ రోజు అంటే 23వ తేదీ ఉదయం 5 గంటలకు తేలుతుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపు ఇలా...
ఓట్ల లెక్కింపు ప్రక్రియ 23వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ అరగంటలో ఆ ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా 8.30 గంటలకు ఓటింగు యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండుకు సంబంధించిన ఫలితాన్ని ఏజెంట్లకు చూపించి.. వారి ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్వో ప్రకటిస్తారు. ఒక్కో రౌండు ఓట్ల లెక్కింపునకు 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది. జిల్లాలో తక్కువ పోలింగు బూత్‌లు ఉన్న శ్రీశైలం నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. ఇక అధిక బూత్‌లు ఉన్న పాణ్యం నియోజకవర్గ ఫలితం చివర్లో వెలువడనుంది. ఈ ఫలితాలను మాత్రం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదేసి చొప్పున వీవీ ప్యాట్లను తీసి.. లెక్కించిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అధికారికంగా తుది ఫలితం వెలువరించేందుకు సాయంత్రం ఆరు గంటలు కావొచ్చు.
3 వేల మంది సిబ్బంది
జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నంద్యాల రోడ్డులోని రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 491, కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా 770 మందిని నియమించారు. వీరితో పాటు ఓట్ల లెక్కింపు సిబ్బంది, సహాయ సిబ్బంది అంతా కలిపి మూడు వేల మంది వరకూ కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. పోలీసు భద్రత విషయానికి వస్తే మూడంచెలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం నుంచి కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. భద్రతాపరంగా వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది 1,200 మంది వరకూ ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment