సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో జరగనున్న పార్లమెంటు, వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు.. కొత్త ఉపాధిని కల్పించనున్నాయి. యువతకూ ఉద్యో గాలు రానున్నాయి. కానీ ఈ రెండూ తాత్కాలికమే కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం ఎన్నికలతో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగాలు రాబోతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి ఆరేడు నెలల పాటు పలు సెక్టార్లలో నిపుణులైన యువతకు అవకాశాలు రాబోతున్నాయని.. మార్కెట్ సర్వేలు, సిబ్బంది సేవల సంస్థలు మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, టీమ్‌లీజ్, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలు చెప్తున్నాయి.
ఐటీ.. డిజిటల్..: దేశంలో ఎన్నికల సీజన్ ఇప్పటికే మొదలైంది. దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. ఐటీ, సోషల్ మీడియాను తమ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఆగస్టు నుంచి పండుగల సీజన్ మొదలవుతోందని, కొనుగోళ్ల సందడితో ఈ–కామర్స్ జోరందుకుంటుందని అంటున్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచుతాయని వివరిస్తున్నాయి.
ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా 7 లక్షల మందికిపైగా ఉద్యోగులను పలు కంపెనీలు తాత్కాలికంగా నియమించుకునే వీలుందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, టీమ్‌లీజ్, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలు అంచనా వేశాయి.
పొలిటికల్ సర్వేల సారాంశమిది దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ ప్రచార జోరు పెంచాయి. పార్టీలు, నిలబడే అభ్యర్థులు సర్వేలు చేయించి పరిస్థితిని విశ్లేషించుకోవడంలో మునిగారు. ఆన్‌లైన్ విధానంలో సాగే సర్వేల కోసం యువత అవసరం ఉంది. దీనికితోడు కార్యాలయంలోనే కూర్చుని క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వగల సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లనూ రూపొందిస్తున్నారు.
సర్వే ఫలితాలను విశ్లేషించి నివేదిక (అనలిటికల్ రిపోర్టు) ఇవ్వడమూ ముఖ్యమే. బలాలు, బలహీనతలను పసిగట్టేలా.. ఓటర్ల మనోగతం తెలుసుకునేలా ఆన్‌లైన్ సర్వే అప్లికేషన్లను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీ ఉద్యోగుల అవసరం ఉంటుంది. ఇప్పటికే దేశంలో పెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలైన కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ వంటి సంస్థలు నియామకాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో కనీసం 80వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉండొచ్చని ఈ కంపెనీలు అంటున్నాయి
డిజిటల్ రంగం తళుకులు
ఎక్కడో ఒకచోట మాట్లాడితే.. దేశమంతటా ప్రచారం కావాలని పార్టీలు కోరుకుంటున్నాయి. దీన్ని సాకారం చేయగల సత్తా డిజిటల్ మీడియాకే ఉంది. గత ఐదేళ్లుగా వర్చువల్ రియాలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకోసం ఆధునిక పరికరాలు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు వస్తున్నాయి. సెల్‌ఫోన్లు సహా ఓటర్ వాడే ప్రతి డిజిటల్ మీడియాకు పార్టీలను తీసుకెళ్లడం అవసరంగా మారింది. ఇందుకోసం డిజిటల్ రంగ నిపుణుల ఆవశ్యకత పెరిగింది. దీనికి అనుగుణంగా విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు రూపొందించడం, ఎడిట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి సాంకేతిక అనుభవం ఉన్న వారికి భారీగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. టెక్ విభాగాల్లో డెవలపర్స్, క్లౌడ్‌టెక్, సైబర్ సెక్యూరిటీ, మొబిలిటీ సైన్స్, వర్చువలైజేషన్, అనలిటిక్స్ వంటి నిపుణులకు ఎన్నికల సీజన్‌లో మంచి వేతనాలతో ఉపాధి ఉండే వీలుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉద్యోగాల ‘పండుగ’
దేశంలో ఆగస్టు నుంచి వరుసగా పెద్ద పండుగలు ఉంటాయి. ఓనమ్, రక్షాబంధన్, జన్మాష్టమి, గణేశ్ నవరాత్రులు, దుర్గాష్టమి, దసరా, దీపావళి, క్రిస్మస్, 2024 కొత్త సంవత్సరం.. ఇలా పండుగలతో కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ క్రమంలో రిటైల్, బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల కంపెనీలు.. భారీగా తాత్కాలిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నాయి.
మ్యాన్‌పవర్ గ్రూప్ అంచనాల ప్రకారం.. రిటైల్ అమ్మకాలు, సహాయక సిబ్బంది, గిడ్డంగుల్లో పికర్స్, ప్యాకర్స్, డెలివరీ సిబ్బంది, వినియోగదారుల రుణాల కంపెనీల వద్ద ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా ఉద్యోగాలు గత ఏడాది కన్నా ఈసారి 25 శాతం ఎక్కువగా ఉంటాయని, సుమారు 2 లక్షల మంది అవసరం ఉండొచ్చని టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది.
నైపుణ్యాలు ముఖ్యం
ఇవి తాత్కాలిక ఉద్యోగాలే అయినా మంచి అవకాశాలే. నిరుద్యోగులకు అనుభవం సంపాదించి పెడతాయి. అనలిస్టులు, ఐటీ నిపుణులకు అవసరమైన పరిజ్ఞానం ఉంటేనే కంపెనీలు ప్రాధాన్యమిస్తాయి. ముఖ్యంగా మేథ్స్‌పై పట్టు ఉన్న వారు రాణించగలరు. ఈ అనుభవం మున్ముందు కూడా దోహద పడుతుంది.
– ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్
మంచి పనితీరు చూపితే పర్మినెంట్ కావొచ్చు
సీజన్‌లో అవసరం కోసం తీసుకున్న ఉద్యోగుల నైపుణ్యాలను కంపెనీలు పరిశీలిస్తాయి. మంచి పనితీరు, ప్రావీణ్యం చూపితే సీజన్ తర్వాత కొన్ని పరీక్షల ద్వారా శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకునే వీలుంది. అందువల్ల చేసే పనిలో ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది.
– జావేద్, బహుళ జాతి సంస్థలో హెచ్‌ఆర్ నిపుణుడు
ఓట్ల పండుగ.. ఉపాధి మెండుగా
Published Tue, Aug 22 2023 1:19 AM | Last Updated on Tue, Aug 22 2023 10:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment