10 నుంచి 12 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని నిర్ణయం
అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలవాలనే వ్యూహం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందనే ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది.
మరింత కష్టపడితే...
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్‌స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్‌షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో...
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment