తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం, సగం ఖేదం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా, ఎనిమిదితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. గతంలో నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిదికి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపువంటిదే.
2028 శాసనసభ ఎన్నికలలో గట్టిగా పోటీ పడడానికి ఈ ఫలితం ఉపకరిస్తుంది. బీఆర్‌ఎస్‌కు పార్లమెంటు ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్నా, జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు. ఇందులో పదికి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ ఎనిమిది సీట్లే వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్‌కు చికాకుగా ఉండేది. అంతవరకు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మోదం కలిగించే అంశమే.
అయినా ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్‌కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. అరవైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లే. కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎనిమిది సీట్లు అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్‌కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఓడించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి చెందారు. కొందరు కాంగ్రెస్ నేతలే సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్‌పై కొంత ఉటుంది.
అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించేదే. ఎందుకంటే ఈ రెండు సీట్లను కాంగ్రెస్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైమ్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరు ఇచ్చారు. మాజీ మంత్రి కే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.80 లక్షల ఓట్ల ఆధిక్యతతో నవిజయం సాధించడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్‌కు గట్టి స్థావరమే అయినా, ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.
భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకు సన్నిహితుడుగా పేరొందారు. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్‌ఎస్ గెలిచినా, ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజిగిరిలో లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ఈటెల రాజేందర్‌కు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్‌ఎస్ బలం అంతా బీజేపీకి ట్రాన్స్‌ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది.
కాంగ్రెస్‌ను వ్యతిరేకించే బీఆర్‌ఎస్ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్‌గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్‌తో పాటు మల్కాజిగిరి సీటులో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్‌ను ఎవరూ ఏమి అననప్పటికి, కాలం గడిచే కొద్ది జరిగే పరిణామాలలో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్‌ఎస్ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికలలో నాలుగు సీట్లే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది తెచ్చుకుందని ఆయన చెప్పవచ్చు కానీ కేవలం మాట వరసకు సమర్ధించుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మైనస్‌గా ఉంది. దాని ప్రభావం కొన్ని ఏరియాలలో ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల వంటి పార్లమెంటు సీట్లలో చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ స్థానాలలో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. ఇది ఆ పార్టీకి బలహీనతగానే ఉంటుంది. కాంగ్రెస్ ఈ స్థానాలలో నిలబెట్టిన ఫిరాయింపుదారులంతా ఓటమిపాలయ్యారు.
సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేయగా, బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా చేవెళ్ల నుంచి, మరో బీఆర్‌ఎస్ నేత పీ మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి నుంచి పోటీచేసి పరాజయం చెందారు. వరంగల్ లో మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఊహించిన రీతిలో ఘనంగా గెలిచారు. మరో మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబబాద్‌లో విజయం సాధించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలులో సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. ఈ ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయానికి సూచిక అని కిషన్ రెడ్డి అన్నప్పటికీ అది అంత తేలికకాదు.
ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్‌ఎస్ ఈ పార్లమెంటు ఎన్నికలలో ఆశలు వదలుకుంది. అందువల్లే వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. ఈ నాలుగేళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్ తదితర చోట్ల గెలిచారు. మెదక్‌లో బీజేపీ నేత రఘునందనరావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీ అయ్యారు. కేసీఆర్, హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు.
ఇంతవరకు బీఆర్‌ఎస్ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది. కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌లు మరోసారి గెలవడం ద్వారా బీజేపీ పట్టు నిలబెట్టుకున్నట్లయింది. ఎప్పటి నుంచో ఎంపీ కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ జీ నగేష్ గెలుపు సాధించారు. మహబూబ్‌నగర్‌లో గెలిచిన డీకే అరుణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని ఈమెకు సీటు ఇచ్చింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలుపొంది గతంలో కోల్పోయిన పట్టును తిరిగి పొందారు. ఈయనది ఒకరకంగా వ్యక్తిగత విజయంగా చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు.
ఈ మొత్తం ప్రక్రియలో బాగా దెబ్బతిన్న పార్టీగా బీఆర్‌ఎస్ నిలిచింది. లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా ఒక్క సీటు కూడా రాకపోవడం వారికి బాధాకరమైన విషయమే. కాకపోతే ఇదేమీ ఊహించని విషయం కాదు. ఇప్పుడు వారు పార్టీ పునర్మిర్మాణంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి తిరిగి పార్టీని పెంపొందిస్తేనే వచ్చే శాసనసభ ఎన్నికలలో నెగ్గే అవకాశం ఉంటుంది.
బీజేపీ ఇంకా పుంజుకుంటే బీఆర్‌ఎస్‌కు గడ్డు కాలమే అవుతుంది. ఈ లోగా బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తులోకి వెళితే అప్పుడు రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. దానిపై అప్పుడే ఒక కంక్లూజన్‌కు రాలేము. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ రెండుపార్టీలే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలలో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అనే చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను అంత తొందరగా తీసివేయలేం.
ఫీనిక్స్ పక్షి మాదిరి మళ్లీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది కానీ, అందుకు చాలా వ్యూహాలు అమలు చేయవలసి ఉంటుంది. మళ్లీ జనంలో బీఆర్‌ఎస్‌పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీలకన్నా తామే బెటర్ అని ప్రజలలో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటిని అయినా అమలు చేసి ప్రజలలో పరపతి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచుకు కూర్చుని ఉంటుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment