రైతుల డిమాండ్లకు చెవి ఒగ్గాలి! | Farmers of Punjab took to the road of protest | Sakshi
Sakshi News home page

రైతుల డిమాండ్లకు చెవి ఒగ్గాలి!

Published Sat, Feb 17 2024 3:58 AM | Last Updated on Sat, Feb 17 2024 3:58 AM

Farmers of Punjab took to the road of protest - Sakshi

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్‌ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం.

అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్‌ వైదొలగడం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్‌ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్‌ వైదొలగడం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి.

రానున్న 2024 పార్లమెంటరీ ఎన్నికలు విరుద్ధమైన అవగాహనలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాల కుల గణన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గు తుందనే భావన పోయి, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ ప్రయోజనం పొందుతుందనే అభిప్రాయం వైపు లోలకం సూచీ కదిలింది. అయితే, సమాఖ్య నిధుల్లో తమ వాటా కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ కథనాన్ని సవాలు చేస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్యనే పంజాబ్‌ రైతులు ఢిల్లీ వైపు కవాతు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనకు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపడంతో ఎన్నికముందు మరోసారి రంగం సిద్ధమైంది. ఢిల్లీ సరిహద్దులో బలగాలను మోహరించి, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, డిమాండ్ల స్వభావం, పాల్గొంటున్న సంఘాలు, ప్రభుత్వ ప్రతిస్పందన వంటి అనేక అంశాలలో, 2020 రైతుల నిరసనలకు ప్రస్తుత నిరసనభిన్నంగా ఉంది.

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలకు జగ్జీత్‌ సింగ్‌ డల్లేవాల్, సర్వన్‌ సింగ్‌ పంఢేర్‌ నేతృత్వంలోని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. వీరు మునుపటి రైతుల నిరసనలో ప్రముఖులు కాదు. దర్శన్‌ పాల్, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ నేతృత్వం వహిస్తున్న రెండు గ్రూపులు భారత్‌ బంద్‌కు వేర్వేరుగా పిలుపు నిచ్చాయి. హరియాణాలో మితిమీరిన ప్రభుత్వాధికార వినియోగానికి వ్యతిరేకంగా భారత్‌ కిసాన్‌ యూనియన్‌(ఉగ్రాహాన్‌) రైల్‌ రోఖోకు ప్రత్యేక పిలుపునిచ్చింది.

2020లో మొదలైన రైతుల ఆందోళనకు సైద్ధాంతికంగా సమ ర్థమైన 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. పైగా అది పంజాబ్‌ కేంద్రంగా మాత్రమే జరగలేదు. అందులో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికి చాలావరకు మౌనంగా ఉన్నాయి. అలాగే రాకేశ్‌ టికైత్, గుర్నామ్‌ సింగ్‌ చఢూనీ నేతృత్వంలోని యూనియన్లు ప్రస్తుతం ఆందోళనలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాయి.

అంతకుముందటి నిరసన ఉద్యమం... పౌర సమాజ కార్య కర్తలు, కళాకారులు, నిపుణులు, పదవీ విరమణ చేసిన పౌర సేవ కులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి విస్తృత మద్దతునుపొందింది. రాడికల్‌ మితవాదులు కూడా తమ సొంత కథనాలతోఅందులోకి వచ్చారు కానీ వారు కేంద్రస్థానంలోకి ప్రవేశించలేదు. ఉద్యమానికి ప్రగతిశీల రైతులు నాయకత్వం వహించడం, వారికి మత కుల అనుబంధాలకు అతీతంగా ఉదారవాదులు మద్దతునివ్వడం వల్ల రాడికల్‌ మితవాద రాజకీయాల పాత్ర పరిమితమైంది.

కానీ ప్రస్తుత నిరసనకు విస్తృతమైన మద్దతు లేదు. పైగా గుర్తింపు రాజకీయాలవెంపర్లాట కూడా దీని వెనుక ఉంటోంది. నేడు రైతు సంఘాలలోని మూడు ప్రధాన వర్గాలు ఒకే బ్యానర్‌ కింద ఐక్యం కాలేదు. అవి ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజ కీయేతరమైన గ్రూప్‌) ఇతర యూనియన్లను అధిగమించి నాయకత్వ స్థానంలోకి ప్రవేశించింది. పంజాబ్‌ ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభు త్వంతో చర్చలు జరపడానికి సిద్ధమైంది. 

డిమాండ్ల విషయానికొస్తే, ప్రస్తుత నిరసనలు మునుపటి కంటే నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగడం, వ్యవసాయ రుణాల మాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులు– రైతు కూలీలకు పెన్షన్లు, 2020–21 నిరసనల సంద ర్భంగా రైతులపై దాఖలైన కేసుల ఉపసంహరణ, నష్టపరిహారంవంటివి ఇందులో ఉన్నాయి. నిరసన కాలంలో మరణించిన రైతు లకూ, ‘లఖీంపూర్‌ ఖీరీ ఘటన’ బాధితులకూ న్యాయం జరిగేలా చూడటం, వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత 2021లో బీజేపీ చేసిన వాగ్దానాలపై దృష్టి పెట్టడం కూడా డిమాండ్లలో ఉన్నాయి.

మరోవైపు, సరిహద్దుల్లో భారీగా కంచెలు వేయడం, ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల్లో 144 సెక్షన్‌ విధించడం చూస్తుంటే ప్రస్తుత నిరసనపై ప్రభుత్వ ప్రతిస్పందన ఇప్పుడు కూడా ప్రతిచర్యగానే కని పిస్తోంది. పంజాబ్, హరియాణాల్లో అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను రాజ స్థాన్‌ మూసివేసింది. అనేక జిల్లాలలో నిషేధాజ్ఞలను విధించింది.

వారి ‘ఢిల్లీ ఛలో’ ప్రకటనకు ముందే, రైతులతో చర్చలు ప్రారంభించినప్ప టికీ, 2021లో చేసిన వాగ్దానాలపై కేంద్రప్రభుత్వం ఇంకా స్పందించ లేదు.అలాగే, నిరసన ప్రదేశంలో టియర్‌ గ్యాస్‌ వాడకం, డ్రోన్ల ద్వారా పొగ బాంబులు వేయడం, రాళ్లు రువ్వడం, వాహనాలను సీజ్‌ చేయడం, రైతులను పోలీసులు నిర్బంధించడం వంటి ఘటనలు అలాగే కొనసాగుతున్నాయి. క్రితంసారి మితిమీరిన బలప్రయోగం జరిపిన అనుభవం నుంచి ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకున్నట్టు లేదు. ఎందుకంటే, మితిమీరిన బలప్రయోగం చేయడం... నిరసనను తీవ్ర దారుల్లోకి మళ్లించాలనుకునేవారికి ఊతమిస్తుంది.

2020లో జరిగిన రైతుల నిరసన నుండి ఇతర పాఠాలు కూడా ఉన్నాయి. అది రైతుల విజయంతో ముగిసింది, అయితే 700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఎజెండాకు వ్యతిరేకంగా ఇది మొదటి, సుదీర్ఘ పోరాటం. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్న వేళ వ్యవసాయ వ్యాపారం (అగ్రి బిజినెస్‌) మాత్రం విపరీతంగా లాభాలు ఆర్జించడం విడ్డూరం. ఆహార ధాన్యాలకు కొత్త మార్కెట్లు లేకపోవడం, నీటి మట్టం తగ్గడం లాంటి కారణాలనే వ్యవసాయ సంక్షోభానికి కారణా లుగా చూపడం పరిస్థితి తీవ్రతను తగ్గించడమే అవుతుంది. 

ఆహారమే ఇప్పుడు రాజకీయం. ఇది కేవలం పరిపాలన, చట్ట పరమైన చర్యల ద్వారా మాత్రమే పరిష్కారం కాదు. ఆహార సార్వ భౌమాధికారం, ఆహార భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం. కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను భాగం చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొన డంలో నిమగ్నం కావాలి. దీన్నొక ఓట్ల వ్యవహారంగా చూడకూడదు. వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేయాలంటే, సబ్సిడీలు ఇవ్వాలి. తమ వాణిజ్య వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి.

క్రితంసారి రైతులు వీధుల్లోకి వచ్చిన ఘటన నుండి మరొక పాఠం ఏమిటంటే, ప్రభుత్వం అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే చట్టాలను రూపొందించాలి. లేకపోతే, అది ప్రజలకు విషాదాన్నీ, నాయకత్వానికి ఇబ్బందినీ కలిగిస్తుంది. మూడు వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన మద్దతును అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ వాగ్దానంపై చొరవ విషయంలో ఆలస్యమే ఇప్పుడు తమ నిరసనను ప్రారంభించేందుకు రైతులకు తగిన కారణాన్ని అందించింది. రాజకీయ నాయకత్వం కేవలం నిరసనలకు మాత్రమే స్పందిస్తుందనీ, ఎన్నికల వేళ మాత్రమే ప్రజల వాణిని వింటుందనే భావన ట్రిగ్గర్‌గా పనిచేసింది.

- వ్యాసకర్త చండీగఢ్‌లోని ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ చైర్‌పర్సన్‌_
-ప్రొ‘‘ ప్రమోద్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement