పొత్తులో భాగంగా ఇచ్చేందుకు అంగీకరించిన బీఆర్‌ఎస్
నాగర్‌కర్నూలు, హైదరాబాద్ సీట్లలో బీఎస్పీ పోటీ
ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు
పెండింగులో భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, మెదక్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్‌సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్‌కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ అంగీకరించింది. బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్‌కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ సుముఖత వ్యక్తం చేసింది.
బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్‌ఎస్ ప్రకటించింది. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్‌ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్‌ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్‌ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment