నిజామాబాద్‌ ఎంపీ బ‌రిలో నిర్మాత దిల్‌ రాజు..? | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ ఎంపీ బ‌రిలో నిర్మాత దిల్‌ రాజు..?

Published Sat, Dec 30 2023 1:20 AM | Last Updated on Sat, Dec 30 2023 4:06 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: 'ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అదే ఊపులో పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అర డజను మంది నాయకులు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్‌ దక్కుతుందోననే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.'

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు పలు వురు నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం రావడంతో నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు జాతీయ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకత నెలకొంది.

సానుభూతిపరంగా సునీల్‌రెడ్డి
బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ముత్యాల సునీల్‌రెడ్డి సైతం ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. స్వల్ప తేడాతో ఓడిపోయినందున సునీల్‌రెడ్డిపై సానుభూతి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలోకి దిగితే సానుకూల ఫలితం వస్తుందని సునీల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని దీటుగా ఎదుర్కోవడంతో సునీల్‌కు కొందరు పార్టీ సీనియర్లు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో సునీల్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • మరోవైపు మైనారిటీ కోటాలో ఈ టికెట్‌ ఆశావహుల జాబితాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ సైతం ఉన్నారు. మైనారిటీ కావడంతో సదరు ఓట్లు తనకు గంపగుత్తగా వస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్టు ఆశించి విఫలమయ్యారు. దీంతో ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జాబితాలో ఈరవత్రి..
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ కూడా ఎంపీ టికెట్‌ ఆశావహుల జాబితాలో ఉన్నారు. బీసీ కోటాలో తనకు టికెట్టు ఇస్తే నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న బీసీ ఓట్లతో పాటు తన సామాజికవర్గానికి చెందిన పద్మశాలి ఓట్లు గంపగుత్తగా వస్తాయనే భావనలో ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కే వస్తాయని భావిస్తున్నారు. సోషల్‌ ఇంజినీరింగ్‌ లెక్కల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మాత్రమే కచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తనకు టికెట్టు ఇస్తే కులాల సమీకరణలో ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు.

  • మరోవైపు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం ఎంపీ టికెట్‌ ఆశించే వారి జాబితాలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండేలా చేసిన మానాలకు టికెట్టు కేటాయించాలని పలువురు అంటున్నారు.
  • ఇదిలా జిల్లాలోని మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజు కూడా నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ కోసం తనవంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మరో ఇద్దరు ముఖ్యులకు..
ఇక ఉమ్మడి జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పీసీసీ అధ్యక్ష పీఠం రేసులో ఉన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. బీసీకి కేటాయిస్తే మహేష్‌కుమార్‌గౌడ్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచి స్తున్నట్లు తెలుస్తోంది. అయితే షబ్బీర్‌అలీకి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కేబినెట్‌లో బెర్త్‌ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్‌ నుంచి గెలుపొందిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌ ఖాయమైనట్లు తెలుస్తోంది. షబ్బీర్‌కు మంత్రి పదవి ఇస్తే జిల్లా నుంచి రెండు బెర్త్‌లు వచ్చినట్లే.

ఇవి చ‌ద‌వండి: ప్రజా పాలన.. అపోహలొద్దు.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement