‘లోక్‌సభ’పై ఫోకస్‌! ఎంపీ ఎన్నికలపై పార్టీల కసరత్తు.. | - | Sakshi
Sakshi News home page

‘లోక్‌సభ’పై ఫోకస్‌! ఎంపీ ఎన్నికలపై పార్టీల కసరత్తు..

Dec 30 2023 2:06 AM | Updated on Dec 30 2023 8:07 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో కసరత్తు షురూ చేశాయి. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఎస్టీ రిజర్వుడ్‌ తెలిసిన విషయమే. ఆయా పార్టీలు జనవరి మధ్యలోనే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ ఎంపీ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలుపొందింది. ఈ ఎన్నికలోనూ ఎలాగైనా గెలుపొందాలని ధీమాగా ఉంది. ఇక కాంగ్రెస్‌ ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ ఈ సారి మాత్రం సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. రెండు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా బీఆర్‌ఎస్‌ కూడా విజయంపై నమ్మకంగా ఉంది.

ఇదీ పరిస్థితి..
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు. అప్పుడు 3,76,892 ఓట్లు సాధించారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన గొడం నగేష్‌ 3,18,665 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేష్‌ 3,14,057 ఓట్లు సాధించారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. బీఆర్‌ఎస్‌ అత్యధిక ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది. అయితే పార్లమెంట్‌ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు తేడా ఉంటుందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రా బోయే ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.

అభ్యర్థుల ఎంపికపై దృష్టి..
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు దృష్టి సారించాయి. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో జరి గిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఇందులో ఆదిలా బాద్‌ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్‌, ఆదిలా బాద్‌, ముథోల్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పాయల్‌ శంకర్‌, రామారావుపటేల్‌, పాల్వాయి హరీష్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

కాగా ఈ సమావేశంలో సిట్టింగ్‌ ఎంపీలు ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి తిరిగి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో సోయం మరోసారి బరిలో నిలుస్తారా చూడాల్సిందే. ఇక బీఆర్‌ఎస్‌ కూడా సమాయత్తం అవుతుంది. జనవరిలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. వచ్చేనెల 3న ఆదిలాబాద్‌కు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముఖ్యనేతలు ఈ సమావేశం నిర్వహిస్తుండగా, పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్యలందరినీ ఆహ్వానించారు.

కాగా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన గొడం నగేష్‌ పేరే మరోసారి తెరపైకి వస్తుంది. ఇక కాంగ్రెస్‌ కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్‌చార్జి మంత్రిగా సీతక్కను నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఈ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులను సమన్వయం చేసుకొని అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్‌ జాదవ్‌తో పాటు ఎవరైన ఆదివాసీ అభ్యర్థిపై పార్టీ దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు..
బీజేపీ: 4,48,961, బీఆర్‌ఎస్‌: 4,65,476, కాంగ్రెస్‌ : 2,52,286

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement