హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. పార్లమెంట్ ఎన్నికలకు భయపడొద్దంటూ ధైర్యం చెప్పారాయన.
తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న కేసీఆర్ ఇవాళ(గురువారం) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం నందినగర్ నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో ముఖ్యనేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త. ఏదో విని చెబితే.. ట్రాప్‌లో పడొద్దు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా.. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి. అదీ జనం మధ్య ఉన్నప్పుడే చేయండి. ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి. పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 స్థానాలు బీఆర్‌ఎస్‌కు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలను ఇలాగే సాగదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. బీఆర్‌ఎస్‌ను బొందపెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి’’అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: త్వరలోనే సీఎం రేవంత్ని కలుస్తా: మల్లారెడ్డి
ఈ మధ్య బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల్ని కలుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. దీంతో వాళ్లు పార్టీలు మారతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా.. ఆ పరిణామాల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌వీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపైనా ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. ‘‘పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఇక నుంచి వారంలో రెండు రోజులు పార్టీ నేతలు, కార్యకర్తలను కలుస్తా. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment