దూతలపై ధూంధాం !
దూతలపై ధూంధాం !
Published Thu, Jan 16 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రానున్న ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల గురించి కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న అభిప్రాయ సేకరణపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకుల పర్యటన గోప్యంగా ఉంచడం, ఒక వర్గానికే ఆహ్వానాలు పంపడం, అభిప్రాయ సేకరణ హడావుడిగా ముగించ డం వంటి సంఘటనలపై క్షేత్రస్థాయిలో కొందరు కార్యకర్తలు,నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాల్లో మొదట నరసరావుపేటపై పరిశీలకులు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అభిప్రాయ సేకరణ చేశారు. వారి వైఖరిని కాంగ్రెస్ లోని ఒక వర్గం తప్పుపడుతోంది. అభిప్రాయ సేకరణ ఇలానే జరిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక కాంగ్రెస్ మనుగడ కష్టమని భావించిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో చేరిపోయారు. అరకొరగా మిగిలిన నేతల్లో దీటైన అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆ పార్టీ పరిశీలకులను పంపితే దానికి భిన్నంగా, కాంగ్రెస్ మార్కు తరహాలోనే అభిప్రాయ సేకరణ జరుగుతుందని కార్యకర్తలు, కొందరు ఆశావహులు ప్రైవేట్ సంభాషణల్లో మండిపడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమ,మంగళవారాల్లో ఏఐసీసీ పరిశీల కులు, కర్ణాటక మాజీ మంత్రి శివమూర్తి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు,
ఠమొదటిపేజీ తరువాయి
పీసీసీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావులు పర్యటించి ఎంపి అభ్యర్థి ఎంపికపై కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. అయితే ఇది సక్రమంగా జరగలేదని ఓ సామాజిక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిపై అభిప్రాయ సేకరణ చేయాలంటే తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు పరిశీలకుల పర్యటన వివరాలను పార్టీనేతలు, కార్యకర్తలకు ఒకటి రెండు రోజులు ముందుగా తెలియచేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఓ సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో గానీ, ప్రైవేట్ భవనంలోగానీ ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిలో జిల్లా అధ్యక్షుడు ఏదీ పాటించలేదు. ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారో ఆ నాయకుని ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలను ముందుగా వెల్లడించనూలేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి రానున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మంత్రి కాసు ఇంట్లోనే పరిశీలకుల సమక్షంలో కార్యకర్తల సమావేశం జరిగింది.
మంత్రి ఇంట్లో ఉండగానే కొందరు కార్యకర్తలను మాత్రమే పిలిచి నరసరావుపేట ఎంపీగా కాసు వెంకట కృష్ణారెడ్డికి సీటు కేటాయించాలని వారితో చెప్పించారు. అదే విధంగా కాసుకు అత్యంత సన్నిహితునిగా మెలుగుతున్న డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు సొంత నియోజకవర్గం విను కొండలో సైతం మక్కెనకు సంబంధించిన రాజీవ్ ఫౌండేషన్‌లో అభిప్రాయసేకరణ జరిపారు. రాత్రి 8 గంటల సమయంలో హడావుడిగా ఈ అభిప్రాయసేకరణ జరిపి మంత్రి కాసుకు ఎంపీ సీటు కేటాయించాలంటూ అధిక శాతం మందితో చెప్పించారు. మంగళ వారం మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించిన పరిశీలకులు శివమూర్తికి దాదాపు 80 శాతం మంది కాంగ్రెస్ నాయకులు మంత్రి కాసుకు ఎంపీ సీటు ఇవ్వాలంటూ చెప్పగా మరో 20 శాతం మంది మాత్రం నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజికవర్గం అధికంగా ఉందని, ఇక్కడ కేంద్రమంత్రి పురందేశ్వరికి ఎంపీ సీటు కేటాయించాలని కోరినట్లు తెలిసింది.
అంతా గోప్యమే....
ఏఐసీసీ పరిశీలకుల పర్యటన వివరాలను తెలియచేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావును ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి రెండు మూడుసార్లు ఫోన్‌లో సంప్రదిస్తే, జిల్లా పరిశీలకులుగా ఎవరిని నియమించిందీ తనకు తెలియదని చెప్పటం కొసమెరుపు.
Advertisement