జిల్లాలో మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కాంతిలాల్ దండే స్పష్టం చేశారు.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తఫ్సీ ర్ ఇక్భాల్, జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర ప్రసాద్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.
కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దీని కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలతో పాటు గ్రామాల్లో కూడా కమిటీలు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్‌కు సంబంధించి డీసీ, ఏఎస్పీలు ఉంటారన్నారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. మండల స్థాయిలో మోడల్‌కోడ్ పర్యవేక్షణా అధికారులుగా ఎంపీడీవోలు ఉంటారని, వారితో పాటు వీడియోగ్రాఫర్, ఎస్సైలు పర్యవేక్షిస్తారన్నారు. అలాగే సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గానికి 4 ప్రత్యేక బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లుగా నియమిస్తామని చెప్పారు.
చెక్‌పోస్టుల ఏర్పాటు
జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి మద్యం, నాటుసారా సరఫరా కాకుండా ఉండేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. బొడ్డవర, మక్కువ, పాచిపెంట, చింతపల్లి, కూనేరు, పి.కోనవలసల్లో చెక్ పోస్టులు కొనసాగుతాయన్నారు. జిల్లాలో కోడ్ ఉల్లంఘనను పరిశీలించడానికి 1070 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు 08922 273255 నంబర్‌తో కంట్రోల్ రూమ్ కొనసాగుతుందన్నారు. విజయనగరం డివిజన్‌లో 08922 276888, సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో 08963 221006 కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పని చేస్తాయన్నారు. ఎక్కడకోడ్ ఉల్లంఘన జరిగినా ప్రజలు ఆ నంబర్‌లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వా లని కోరారు.
పటిష్ట బందోబస్తు :
జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌లను పలు రకాలుగా వర్గీకరించినట్లు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు, సమస్యా త్మ క పోలింగ్ కేంద్రం వద్ద నలుగురు, వివాదాలు ఉన్నచోట ముగ్గురు చొప్పున పోలీసులను నియమిస్తామని చెప్పారు. వీరితో పాటు ప్రత్యేక సిబ్బంది నిఘా కొనసాగు తుందన్నారు.
బెల్ట్ దుకాణాలు మూసేయాలి
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లాలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేంద్రబాబు తెలిపారు. బయటకు మద్యం ఇవ్వకూడదని జిల్లాలో ఉన్న లెసైన్స్ షాపులు, బారుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇకవేళ ఆ నోటీసులను ఎవరైనా ఉపేక్షిస్తే లెసైన్స్‌షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిరంతరం కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ టీవీ ఏర్పాటు చేశామని అందులో వార్తలను చూసి సంబంధిత ప్రదేశాల్లో దాడులు చేస్తామన్నారు. జిల్లాస్థాయిలో 08922 255890, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ల పరిధిలో 08922 274865, పార్వతీపురంలో 08963 220781 నంబర్‌లతో ప్రత్యే కంట్రోల్ రూమ్‌లు కొనసాగుతాయని వివరించారు. సమావేశంలో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్వో బి.హేమసుందర వెంకటరావు, ఆర్డీవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.