కట్టల పాములోచ్
సాక్షి, నల్లగొండ,ఎన్నికల నేపథ్యంలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఓటర్లకు ఆయా పార్టీల నాయకులు డబ్బులతో గాలం వేస్తున్నారు. ఇందుకోసం డబ్బులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ వారి వద్ద లేకపోవడంతో పోలీసులు డబ్బులు సీజ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నగదు తరలింపు జోరందుకుంది. కొన్నిచోట్ల పట్టుబడుతున్నా.. మరికొన్ని చోట్ల నిఘా కంట పడకుండా జారుకుంటున్నారు. వీటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం మొదలు పెడితే నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఓటర్లను ప్రలోభాల నుంచి దూరం చేయవచ్చు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు రూ.ఒక కోటి 16 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, జిల్లా, మండల పరిషత్‌లతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశంతో నాయకులు ఓటర్లకు నోట్లగాలం వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇప్పటికే కొందరు నాయకులు ఓటర్లకు పంచేందుకు సొమ్ము సిద్ధం చేసుకున్నారు. భాగాలుగా విభజించి పలువురి వద్ద ఉంచుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు తెప్పించుకోవడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని పలుచోట్లవరుసగా పట్టుబడుతున్న నోట్ల కట్టలే ఇందుకు నిద ర్శనం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది మొదలు డబ్బులు పట్టుబడుతూనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలు, వెండి వస్తువులు, ముక్కు పుడకలు వంటివి సమకూర్చుకోవడంలో నేతలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నిదారుల్లో నిఘా...
జిల్లా పరిధిలోకి వచ్చే అన్నిదారుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అద్దంకి - నార్కట్‌పల్లి, నాగార్జునసాగర్- హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడ, వరంగల్ దారుల్లో, ఖమ్మం, మహబూబ్‌నగర్‌కు వెళ్లే దారుల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా చేశారు. ఈ దారుల్లోనేగాక జిల్లాలోని ఇతర పట్టణాల్లో కలిపి మొత్తం 36 చెక్‌పోస్టుల వద్ద 24 గంటలపాటు వాహనాల సోదాలు చేపడుతున్నారు.
ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐతోపాటు దాదాపు 10మంది పోలీ సులు విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నాయి. దీనికితోడు 36 స్టాటిస్టికల్ సర్విలెన్స్ బృందాలు జిల్లా యూనిట్‌గా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఏ క్షణాన ఎక్కడ తనిఖీలు చేస్తారన్నది ఎవ రికీ అంతుపట్టడం లేదు. దీంతో అక్రమంగా డబ్బు తరలిస్తున్నవారు పట్టుబడుతున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికితోడు, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండకూడదని కఠినంగా ఆదేశాలందాయి. అయినా అనేక గ్రామాల్లో అక్కడక్కడా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. కొత్త వ్యక్తులు వెళితే మద్యం లేదని చెబుతున్నా... తెలిసిన వాళ్లు పోతే కాదు, లేదనకుండా అమ్ముతున్నారు. ఇలా వక్రమార్గంలో మద్యం విక్రయాలు యథావిధిగా సాగుతున్నాయి. అంతేగాక పగలంతా దుకాణాలకు తాళాలు వేసి.. రాత్రిపూట విక్రయిస్తున్న ఘటనలూ ఉన్నాయి.
వీటిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కన్నేస్తే మద్యం వరదకు అడ్డుకట్ట పడవచ్చు. జిల్లాలో ఇప్పటివరకు 5,533లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 1789బీరు సీసాలు, 2311 మద్యం క్వార్టర్లు, 92 హాఫ్‌లు, 228 ఫుల్ బాటిళ్లు పట్టుకున్నారు. 49,810కిలోల బెల్లం, 945కిలోల పటిక స్వా దీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్లో నాయకులు మద్యం వరద ఎలా పారించాలనుకున్నా రో ఊహించుకోవచ్చు.