సాక్షిప్రతినిధి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రోజుకో కృష్ణుడు తెరపైకి వస్తున్నారు. సమాజంలో గుర్తింపు ఉన్న కొందరిని ఎంచుకుని వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. నీకే టికెట్ అంటూ ఆశలు కల్పిస్తున్నారు. దీంతో వారంతా హడావుడిగా పార్టీలో చేరిపోతున్నారు. ఆ తరువాత చంద్రబాబు వద్ద వేరే జాబితా వుంటుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే వారి పేర్లు తెరమరుగు అవుతున్నాయి. ఇలా ప్రతీ నియోజకవర్గంలో కొత్తగా రెండు మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి..పోతున్నాయి. సిట్టింగ్ అభ్యర్థులు తప్ప మిగిలిన అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ కోసం కష్టపడి, ఖర్చు పెట్టిన వారిని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతో నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీ క్యాడర్ మరింత డీలా పడిపోతోంది.
గుంటూరు తూర్పు నియోజక వర్గ అభ్యర్థిగా మొదట మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పేరు ప్రతిపాదనలో ఉండగా , అతని స్థానంలో ఆల్తాఫ్ తెరపైకి వచ్చారు. మరో వైపు వైశ్యులకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ క్రమంలో గ్రంధి కాంతారావు, దేవరశెట్టి సుబ్బారావు, దేవరశెట్టి సత్యనారాయణ(చిన్ని), బొలిశెట్టి కామేశ్వరరావు పేర్లు వినపడుతున్నాయి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోవెలమూడి నాని, మోదుగుల వేణుగోపాలరెడ్డి, తులసి రామచంద్ర, వసంత కృష్ణ ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గానికి మధుబాబు, చలమారెడ్డి, బ్రాహ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి చివరిగా ఓ ప్రభుత్వ ఉన్నత అధికారిపేరు పరిశీలలో ఉన్నట్లు తెలుస్తోంది.
సత్తెనపల్లికి మొదట కోడెల, అనంతరం నిమ్మకాయల రాజనారాయణ, పొట్ల సుబ్బారావు, తాజాగా చలపతి సంస్థల అధినేత వై వి ఆంజనేయులు పేరు ఖరారు కానున్నట్లు సమాచారం. ప్రత్తిపాడు అభ్యర్థి ఇంతవరకూ ఖరారు కాలేదు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి పేరు పరిశీలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మంగళగిరి అభ్యర్థిగా తొలి నుంచీ అనుకుంటున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను కాదని ,స్థానిక నాయకుడు పోతినేని శ్రీనివాసరావు తోపాటు మరో ఇద్దరు నాయకులు క్యూలో వున్నారని చెపుతున్నారు.రేపల్లెకు అనగాని సత్యప్రసాద్ అని ఒకసారి, తాజాగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పేరును పరిశీలిస్తున్నారు.
తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్‌కు టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా తాజాగా మాజీ మంత్రి పుష్పరాజ్ తెరపైకి వచ్చారు.
తెరపైకి లావు రత్తయ్య... నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిత్వం రోజుకో మలుపు తిరుగు తోంది. సిట్టింగ్ ఎంపీ వేణుగోపాలరెడ్డిని కాదని గుంటూరు ఎంపీ రాయపాటికి టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తెరపైకి వచ్చారు. ఆయనను ఓ వర్గం నాయకులు అధినేత చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లినట్లు సమాచారం.
జిల్లాలోని కాన్వెంట్లు, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం నరసరావుపేటలో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ టికెట్ రత్తయ్యకు ఇచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం అక్రమార్కులకు అండ... చంద్రబాబు అక్రమార్కులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారని ఆ పార్టీ నుంచే వినపడుతోంది. ప్రభుత్వం నిషేధించిన గుట్కాను అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్న ఒక వ్యక్తిని అధినేత చేర్చుకోవడంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రోజుకో ‘రాజా’
Published Tue, Mar 25 2014 11:47 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement