district Telugu Desam Party
-
పదవులపై ఆశలు!
- నాలుగు నెలలుగా తెలుగు తమ్ముళ్ల నిరీక్షణ - నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు - అధినేత అనుగ్రహం ఎప్పటికో? కర్నూలు :జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు పార్టీ అధినేత చేసిన హామీ మేరకు తమకు ఏదో రకంగా గుర్తింపు లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా సరైన గుర్తింపు లభించడం లేదన్న నిరాశ, నిస్పృహల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా నామినేటెడ్ పదవులు చేపట్టాలని కొంతమంది ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు, తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్రియాశీలకంగా వ్యవహరించిన పలువురు నాయకులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడింది. జిల్లాలో కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అధినేత చంద్రబాబు ఆశించిన మేరకు ఫలితాలు రాలేదన్న అసంతృప్తి ఉన్నా.. పార్టీ అధికారంలోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కీలకంగా మారడంతో జిల్లాలోని నాయకులు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన సోదరులు, అనుచరుల తీరు కొంతమంది నాయకులకు ఇబ్బందికరంగా మారింది. నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సంబంధాలున్న వ్యక్తులు సైతం ఇప్పుడు కేఈ సోదరుల కనుసన్నల్లో నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి జిల్లాలో ఇంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు కాలేదు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జిల వ్యవహారం వివాదంగా తయారయ్యింది. ఇది ప్రభుత్వ అధికారుల బదిలీలపై ప్రభావం చూపుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. జిల్లాలో 12 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులను కొంతమంది ఆశిస్తున్నారు. అందుకు ఉప ముఖ్యమంత్రి సిఫారసు కీలకం కానుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా జిల్లాకు ఇంతవరకు కీలకమైన పదవి ఒక్కటీ దక్కలేదు. బనగానపల్లె నుంచి మొదటిసారి ఎన్నికైన బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. జిల్లాకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోనే అధినేత సరిపెట్టారు. మాజీ మంత్రి ఒకరు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా ఆయనను తీసుకుంటారని కొంతకాలం ప్రచారం సాగింది. ఎన్నికల ముందు కర్నూలు టికెట్ ఆశించి అధినేత హామీతో పోటీ నుంచి వైదొలగిన మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి కూడా ఎమ్మెల్సీ లేదా సమాన హోదా పదవి ఆశిస్తున్నారు. కర్నూలు నుంచి పోటీ చేసి టీజీ వెంకటేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎన్ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతోంది. హేమాహేమీలు ఆశిస్తున్న శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ పదవికి తుగ్గలి నాగేంద్రతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టును ఆశిస్తున్నారు. అయితే పార్టీని అడ్డం పెట్టుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆ పార్టీకి చెందిన నాయకులే అధినేతకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి. జిల్లాలోని పలు నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పటి ఫలిస్తాయో మరి... -
చేరికలు... పీలికలు.. !
సాక్షి ప్రతినిధి, గుంటూరు,జిల్లా తెలుగుదేశం పార్టీలో కీచులాటలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. ఓ వైపు చేరికలతో వాపును బలంగా చూపించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తమ్ముళ్లు షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల చేరికతో పార్టీలో పీలికలు తయారవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. దేశం పార్టీ అధినేత అవలంబిస్తున్న అవకాశవాద రాజకీయాలపై ఇక్కడి తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవిస్తూ వస్తున్న వారికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే బాబుతో తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన తమ్ముడు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయపాటి మోహనసాయికృష్ణ సహా ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. సాంబశివరావుకు నరసరావుపేట ఎంపీ టికెట్, శ్రీనివాసరావుకు మంగళగిరి లేదా, గుంటూరు పశ్చిమ, మెహన్సాయి కృష్ణకు గుంటూరు మేయరు పదవి కేటాయించే విధంగా ఒప్పందం కుదిరినట్టు పార్టీలో వినపడుతున్న పరిణామం పార్టీకి ఏ విధంగా మంచిదో బాబుకే తెలియాలని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వేదికగా కొంతమంది అసమ్మతి నేతలు సైతం హైదరాబాద్ పయనమవుతున్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు సంబంధించిన టికెట్ల కేటాయింపుపై చంద్రబాబును కలసి తమ వాదన వినిపించనున్నారు. నిన్నటి వరకు కృష్ణా జిల్లాలో ఎంపీ లగడపాటికి కుడిభుజంగా వ్యవహరించిన వసంత కృష్ణప్రసాద్‌కు గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్న ఇక్కడి వారిని కాదని దిగుమతి చేసుకున్న నాయకులకు టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. మరో వైపు ముస్లిం నాయకులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు టికెట్ కేటాయించాలని చంద్రబాబును కలవనున్నారు. తాజాగా ఇక్కడ ఆర్యవైశ్యులకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్రస్థాయిలో అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్యులు సైతం గ్రూపులుగా విడిపోయి టికెట్ తమకంటే తమకని ప్రచారం చేసుకుంటున్నారు. కులాల కుంపటి రాజేసిన బాబు : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు చేస్తున్న అవకాశవాద రాజకీయాలు కులాల మధ్య అంతరాన్ని పెంచుతుందని కార్యకర్తలు వాపోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు వర్గాల విషయంలో బాబు వైఖరిపై సీనియర్ నాయకులు సైతం తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, రేపల్లె, మాచర్ల, బాపట్ల టికెట్ల కేటాయింపుపై బాబు రోజుకో మాట మారుస్తుండడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురువుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ చంద్రబాబు చేష్టలతో జిల్లాలో గల్లంతు కావడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. -
రోజుకో ‘రాజా’
సాక్షిప్రతినిధి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రోజుకో కృష్ణుడు తెరపైకి వస్తున్నారు. సమాజంలో గుర్తింపు ఉన్న కొందరిని ఎంచుకుని వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. నీకే టికెట్ అంటూ ఆశలు కల్పిస్తున్నారు. దీంతో వారంతా హడావుడిగా పార్టీలో చేరిపోతున్నారు. ఆ తరువాత చంద్రబాబు వద్ద వేరే జాబితా వుంటుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే వారి పేర్లు తెరమరుగు అవుతున్నాయి. ఇలా ప్రతీ నియోజకవర్గంలో కొత్తగా రెండు మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి..పోతున్నాయి. సిట్టింగ్ అభ్యర్థులు తప్ప మిగిలిన అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ కోసం కష్టపడి, ఖర్చు పెట్టిన వారిని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతో నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీ క్యాడర్ మరింత డీలా పడిపోతోంది. గుంటూరు తూర్పు నియోజక వర్గ అభ్యర్థిగా మొదట మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పేరు ప్రతిపాదనలో ఉండగా , అతని స్థానంలో ఆల్తాఫ్ తెరపైకి వచ్చారు. మరో వైపు వైశ్యులకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ క్రమంలో గ్రంధి కాంతారావు, దేవరశెట్టి సుబ్బారావు, దేవరశెట్టి సత్యనారాయణ(చిన్ని), బొలిశెట్టి కామేశ్వరరావు పేర్లు వినపడుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోవెలమూడి నాని, మోదుగుల వేణుగోపాలరెడ్డి, తులసి రామచంద్ర, వసంత కృష్ణ ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గానికి మధుబాబు, చలమారెడ్డి, బ్రాహ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి చివరిగా ఓ ప్రభుత్వ ఉన్నత అధికారిపేరు పరిశీలలో ఉన్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లికి మొదట కోడెల, అనంతరం నిమ్మకాయల రాజనారాయణ, పొట్ల సుబ్బారావు, తాజాగా చలపతి సంస్థల అధినేత వై వి ఆంజనేయులు పేరు ఖరారు కానున్నట్లు సమాచారం. ప్రత్తిపాడు అభ్యర్థి ఇంతవరకూ ఖరారు కాలేదు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి పేరు పరిశీలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మంగళగిరి అభ్యర్థిగా తొలి నుంచీ అనుకుంటున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను కాదని ,స్థానిక నాయకుడు పోతినేని శ్రీనివాసరావు తోపాటు మరో ఇద్దరు నాయకులు క్యూలో వున్నారని చెపుతున్నారు.రేపల్లెకు అనగాని సత్యప్రసాద్ అని ఒకసారి, తాజాగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పేరును పరిశీలిస్తున్నారు. తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్‌కు టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా తాజాగా మాజీ మంత్రి పుష్పరాజ్ తెరపైకి వచ్చారు. తెరపైకి లావు రత్తయ్య... నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిత్వం రోజుకో మలుపు తిరుగు తోంది. సిట్టింగ్ ఎంపీ వేణుగోపాలరెడ్డిని కాదని గుంటూరు ఎంపీ రాయపాటికి టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తెరపైకి వచ్చారు. ఆయనను ఓ వర్గం నాయకులు అధినేత చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లినట్లు సమాచారం. జిల్లాలోని కాన్వెంట్లు, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం నరసరావుపేటలో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ టికెట్ రత్తయ్యకు ఇచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం అక్రమార్కులకు అండ... చంద్రబాబు అక్రమార్కులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారని ఆ పార్టీ నుంచే వినపడుతోంది. ప్రభుత్వం నిషేధించిన గుట్కాను అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్న ఒక వ్యక్తిని అధినేత చేర్చుకోవడంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.