చేరికలు... పీలికలు.. !
సాక్షి ప్రతినిధి, గుంటూరు,జిల్లా తెలుగుదేశం పార్టీలో కీచులాటలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. ఓ వైపు చేరికలతో వాపును బలంగా చూపించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తమ్ముళ్లు షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల చేరికతో పార్టీలో పీలికలు తయారవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. దేశం పార్టీ అధినేత అవలంబిస్తున్న అవకాశవాద రాజకీయాలపై ఇక్కడి తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవిస్తూ వస్తున్న వారికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే బాబుతో తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన తమ్ముడు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయపాటి మోహనసాయికృష్ణ సహా ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. సాంబశివరావుకు నరసరావుపేట ఎంపీ టికెట్, శ్రీనివాసరావుకు మంగళగిరి లేదా, గుంటూరు పశ్చిమ, మెహన్‌సాయి కృష్ణకు గుంటూరు మేయరు పదవి కేటాయించే విధంగా ఒప్పందం కుదిరినట్టు పార్టీలో వినపడుతున్న పరిణామం పార్టీకి ఏ విధంగా మంచిదో బాబుకే తెలియాలని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వేదికగా కొంతమంది అసమ్మతి నేతలు సైతం హైదరాబాద్ పయనమవుతున్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు సంబంధించిన టికెట్ల కేటాయింపుపై చంద్రబాబును కలసి తమ వాదన వినిపించనున్నారు.
నిన్నటి వరకు కృష్ణా జిల్లాలో ఎంపీ లగడపాటికి కుడిభుజంగా వ్యవహరించిన వసంత కృష్ణప్రసాద్‌కు గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్న ఇక్కడి వారిని కాదని దిగుమతి చేసుకున్న నాయకులకు టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. మరో వైపు ముస్లిం నాయకులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు టికెట్ కేటాయించాలని చంద్రబాబును కలవనున్నారు. తాజాగా ఇక్కడ ఆర్యవైశ్యులకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్రస్థాయిలో అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్యులు సైతం గ్రూపులుగా విడిపోయి టికెట్ తమకంటే తమకని ప్రచారం చేసుకుంటున్నారు.
కులాల కుంపటి రాజేసిన బాబు : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు చేస్తున్న అవకాశవాద రాజకీయాలు కులాల మధ్య అంతరాన్ని పెంచుతుందని కార్యకర్తలు వాపోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు వర్గాల విషయంలో బాబు వైఖరిపై సీనియర్ నాయకులు సైతం తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, రేపల్లె, మాచర్ల, బాపట్ల టికెట్ల కేటాయింపుపై బాబు రోజుకో మాట మారుస్తుండడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురువుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ చంద్రబాబు చేష్టలతో జిల్లాలో గల్లంతు కావడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.