- నాలుగు నెలలుగా తెలుగు తమ్ముళ్ల నిరీక్షణ
- నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు
- అధినేత అనుగ్రహం ఎప్పటికో?
కర్నూలు :జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు పార్టీ అధినేత చేసిన హామీ మేరకు తమకు ఏదో రకంగా గుర్తింపు లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా సరైన గుర్తింపు లభించడం లేదన్న నిరాశ, నిస్పృహల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా నామినేటెడ్ పదవులు చేపట్టాలని కొంతమంది ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు, తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్రియాశీలకంగా వ్యవహరించిన పలువురు నాయకులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడింది. జిల్లాలో కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అధినేత చంద్రబాబు ఆశించిన మేరకు ఫలితాలు రాలేదన్న అసంతృప్తి ఉన్నా.. పార్టీ అధికారంలోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం.
ప్రస్తుతం జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కీలకంగా మారడంతో జిల్లాలోని నాయకులు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన సోదరులు, అనుచరుల తీరు కొంతమంది నాయకులకు ఇబ్బందికరంగా మారింది. నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సంబంధాలున్న వ్యక్తులు సైతం ఇప్పుడు కేఈ సోదరుల కనుసన్నల్లో నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి జిల్లాలో ఇంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు కాలేదు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల వ్యవహారం వివాదంగా తయారయ్యింది. ఇది ప్రభుత్వ అధికారుల బదిలీలపై ప్రభావం చూపుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. జిల్లాలో 12 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
జిల్లా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులను కొంతమంది ఆశిస్తున్నారు. అందుకు ఉప ముఖ్యమంత్రి సిఫారసు కీలకం కానుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా జిల్లాకు ఇంతవరకు కీలకమైన పదవి ఒక్కటీ దక్కలేదు. బనగానపల్లె నుంచి మొదటిసారి ఎన్నికైన బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. జిల్లాకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోనే అధినేత సరిపెట్టారు. మాజీ మంత్రి ఒకరు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా ఆయనను తీసుకుంటారని కొంతకాలం ప్రచారం సాగింది.
ఎన్నికల ముందు కర్నూలు టికెట్ ఆశించి అధినేత హామీతో పోటీ నుంచి వైదొలగిన మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి కూడా ఎమ్మెల్సీ లేదా సమాన హోదా పదవి ఆశిస్తున్నారు. కర్నూలు నుంచి పోటీ చేసి టీజీ వెంకటేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతోంది.
హేమాహేమీలు ఆశిస్తున్న శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ పదవికి తుగ్గలి నాగేంద్రతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టును ఆశిస్తున్నారు. అయితే పార్టీని అడ్డం పెట్టుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆ పార్టీకి చెందిన నాయకులే అధినేతకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి. జిల్లాలోని పలు నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పటి ఫలిస్తాయో మరి...
పదవులపై ఆశలు!
Published Sat, Sep 20 2014 11:55 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement