నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తా
ఎన్నికల సభల్లో కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి
ఫ్లోరైడ్ పీడ విరగడకు ప్రాధాన్యం
అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు
కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘పాలమూరు వలసలతో మహబూబ్‌నగర్ జిల్లాకు జరిగిన నష్టం కన్నా, ఫ్లోరైడ్ సమస్యతో నల్లగొండ జిల్లాకు జరిగిన నష్టమే ఎక్కువ. దశాబ్దాల పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులే కారణం. అయినా, మరో సారి వారే ముందుకు వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎవరి చేతిలో పెడితే తలరాతలు మారతాయో ఆలోచించండి. నలభై ఏళ్లు కాంగ్రె స్, పద్దెనిమిదేళ్లు టీడీపీల పాలన చూశాం. ఇంకా వాళ్లుఅవసరమా అని..’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.
బుధవారం ఆయన జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికను వివరిస్తూనే, జిల్లా అభివృద్ధికి తామేం చేయాలనుకంటున్నామో తెలిపారు. అదే సమయంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సాగర్ నిర్మాణంలో మోసం
నాగార్జునసాగర్‌ను వాస్తవానికి ఎగువలో 19 కిలోమీటర్ల దూరంలోని ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉన్నా మోసం జరిగిందని ఆరోపించారు. ఫలితంగా ఆయకట్టు చివరి భూములకు సాగునీరంద ని దుస్థితి నెలకొందన్నారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో జగ్గయ్యపేట, నందిగామలను కలపడం వల్ల నష్టం జరిగిందన్నారు.
ఖమ్మం జిల్లా ఆయకట్టు తగ్గిపోయిందని గుర్తు చేశారు. తాము ఎడమ కాల్వ సామర్ద్యం పెంచుతామని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు మొదలై ఎన్నాళ్లయ్యింది. కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలవంచుకోవాలి. మాట్లాడడానికే సిగ్గనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలో అంతా మంత్రులు, సామంతులే.. పనులు మాత్రం పూర్తి కావు. ఎందుకు వీరుండి. ఏం లాభం అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి పనులను రెండేళ్లలో పూర్తి చేయించి అ నీళ్లతో దేవరకొండ, మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతా అని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో లక్ష చొప్పున పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తానని హామీ ఇచ్చారు.
మూసీ ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామని, ఎస్సారె స్పీ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి నీరందేలా శ్రద్ధ తీసుకుంటానన్నారు. టెయిలెండ్ భూములకు నీరిందించడంతో పాటు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు.
అణుబాంబు కంటే ఫ్లోరైడ్ విధ్వంసమే ఎక్కువ
హిరోషిమా, నాగసాకిలపై పడిన అణుబాంబు సృష్టించిన విధ్వంసం కంటే, ఫ్లోరైడ్ వల్ల జరిగిన విధ్వంసం ఎక్కువన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే, ఈ సమస్యపై దృష్టి పెట్టి కేవలం రెండేళ్లలో ప్రతి గ్రామానికీ కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
తాగునీటి కోసం తండ్లాడుతున్న తుంగతుర్తి నియోజకవర్గానికి పాలేరు జలాలు తీసుకు వస్తానని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తండాలకు కనీసం తాగునీరందించేలేక పోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
చివరి సభ జరిగే సూర్యాపేటకు కేసీఆర్ రాత్రి 9.48 గంటలకు వచ్చారు. ప్రసంగానికి కేవలం 12నిమిషాలే ఉండడంతో ఆ సమయం లోనే ఆయన ప్రసంగాన్ని ముగించారు. అక్కడ సభలో కేసీఆర్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే ఆయనను రాష్ట్ర మంత్రిని చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ నేతలపై .. ఫైర్
జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, ప్రధానంగా మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై నిప్పులు గక్కారు. జానారెడ్డి పరిస్థితి.. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సాగర్‌కు డిగ్రీ కాలేజీ లేదని అంటున్నారు. సాగర్ న ఎటూ కాకుండా చేశారని విమర్శించారు.
ఉపాధ్యాయ జేఏసీ నేతలపై కేసులు పెట్టించిన జానారెడ్డి ఎలాంటి తెలంగాణ వాది అని ప్రశ్నించారు. 610 జీఓ ఛైర్మన్‌గా ఉండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసింది ఏంది? ఎడమ కాల్వ చైర్మన్ పదవిని జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తికి అప్పజెబుతావా? మళ్లీ నిన్ను గెలిపిస్తే, మొత్తం ఎడమ కాల్వను వాళ్ల చేతుల్లో పెడతవ్ అని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గెలిస్తేంది..? లేకుంటే ఏంది? ఏం ఫరక్ పడదు అని వ్యాఖ్యానించారు.