టీఆర్‌ఎస్‌కు కేడర్!
* మొదటిసారిగా అన్ని స్థానాల్లో పోటీ
* 50 నియోజకవర్గాల్లో నిర్మాణ సమస్య
* సెంటిమెంటుపైనే అభ్యర్థుల ఆశలన్నీ
బోరెడ్డి అయోధ్యరెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భవించిన 13 ఏళ్ల తర్వాత తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను తొలిసారిగా బరిలోకి దింపింది. తొలిసారిగా ఇక్కడ అన్ని స్థానాలకూ పోటీ చేస్తున్నా ఆ పార్టీని చాలా నియోజకవర్గాల్లో కేడర్ లేని దుస్థితి వెన్నాడుతోంది. దాదాపు 50పైకి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు కేవలం నామమాత్రపు పోటీకే పరిమితమవుతున్నారు. ఆయా చోట్ల మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకుపోవడానికి కేడర్ కోసం కేడర్ కోసం దేవులాడుతున్నారు. తెలంగాణకోసం త్యాగాలు చేసిన పార్టీగా, తెలంగాణ సమస్యలపై అవగాహన ఉన్న పార్టీగా నవనిర్మాణంలో ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామనే సెంటిమెంటుతోనే ప్రచారానికి దిగుతున్నారు.
నాడు పొత్తులు...నేడు కత్తులు
టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన మూడేళ్ల తర్వాత 2004లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 42 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో పొత్తుల్లో భాగంగా అభ్యర్థులను పోటీలోకి దించింది. 2009లో టీడీపీ, సీపీఎం, సీపీఐతో కలిసి టీఆర్‌ఎస్ 55 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను రంగంలో పెట్టింది. 2004లో 42 మంది పోటీచేస్తే 26 మంది టీఆర్‌ఎస్ నుండి ఎమ్మెల్యేలుగా గెలిస్తే, 2009లో 10 మంది మాత్రమే గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పొత్తుల వల్ల టీఆర్‌ఎస్ పోటీ చేసిన చోట లాభపడినా, మిగతా చోట్ల పార్టీకి నిర్మాణమే లేకుండా పోయింది. ఉద్యమకాలంలో తెలంగాణవ్యాప్తంగా సానుకూల ప్రచారం వచ్చినా దాన్ని సంఘటితం చేసుకోలేకపోయింది. ఇప్పటికీ కొన్ని సెగ్మెంట్లలో మండల కమిటీలే లేవు! పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయిలో యంత్రా ంగం ఏర్పాటులోనూ శ్రద్ధ చూపించలేదు.
అంతుపట్టని వైఖరి...
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత టీఆర్‌ఎస్ విలీనం అవుతుందా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందా అనేదానిపై పార్టీ అగ్రనాయకత్వంలో ఆఖరిరోజు దాకా అస్పష్టతే ఉంది. దీంతో 2009 నుంచి 2014 దాకా ఎప్పటికప్పుడు పైపై కార్యక్రమాలు తప్ప ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నిర్మాణం చేసుకోలేకపోయింది. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీచేయాల్సి ఉంటుందని నెలక్రితం దాకా పార్టీ ముఖ్యనేతలు కూడా విశ్వసించలేదు. దీంతో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని చూపించలేకపోయారు. ఇదే పరిస్థితి ఈ పరిస్థితి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని రెండుమూడు నియోజకవర్గాల్లో మినహా ఎక్కువ స్థానాల్లో ఉంది. అలాగే కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనూ, ఐదేళ్లపాటు ఎంపీగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఉంది.
సెంటిమెంటుపైనే ఆశలన్నీ....
కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు అయిన ‘కారు’ను ప్రజల్లోకి నడిపించే కేడర్ లేదని ఆ పార్టీ ముఖ్య నేతలే అంతర్గత భేటీల్లో అంగీకరిస్తున్నారు. తెలంగాణ కోసం సుదీర్ఘపోరాటం చేసిన కీర్తి, తెలంగాణ సమస్యలను గుర్తెరిగిన పార్టీగా రాష్ట్ర నిర్మాణంలోనూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామనే సెంటిమెంటునే ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు గెలిచే అవకాశాలు లేకపోయినా పార్టీ విస్తరణకు, భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు దోహదపడుతుందని టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది.