జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం.
పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం.
‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది.
దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది.
తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది.
కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం.
కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత?
ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు.
అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు.
ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
Comments
Please login to add a commentAdd a comment