
సాక్షి, జనగామ : త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా ఆశావహులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ టికెట్ దక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఆచితూచి వ్యహరిస్తుండగా ఆశావహులు మాత్రం టికెట్ల కోసం నేతలను కలుస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం వడబోత ప్రారంభించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంపీ టికెట్ ఆశించే అభ్యర్థుల నుంచి ఏకంగా దరఖాస్తులను స్వీకరించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని ఆశావహులు టికెట్లను దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
హస్తం టికెట్ కోసం డాక్టర్ రాజమౌళి..
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం జనగామకు చెందిన ప్రముఖ వైద్యులు చంద్రగిరి రాజమౌళి దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ పార్లమెంటు (ఎస్సీ) స్థానం నుంచి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. పట్టణానికి చెందిన దళిత సంఘ నాయకుడిగా, వైద్యుడిగా రాజమౌళి రాణిస్తున్నారు. 2009లో చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ పార్టీలో చేరి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి రాజమౌళి బరిలోకి దిగి మూడో స్థానంలో
నిలిచారు. కొన్ని రోజులకే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో తటస్థంగా ఉన్నారు. దళిత, ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 2015లో జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి
డాక్టర్ సుగుణాకర్‌రాజు..
టీఆర్‌ఎస్ పార్టీలో కొత్త వారికే చాన్స్ ఇస్తామని అధినేత కేసీఆర్ సంకేతాలు ఇస్తుండడంతో జనగామకు చెందిన డాక్టర్ పడిగిపాటి సుగుణాకర్‌రాజు వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు. వైద్యవృత్తిలో రాణిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రెండు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉన్న సుగుణాకర్‌రాజు 2015లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో వరంగల్ టికెట్‌ను తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో సాగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఈ సారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన బయోడేటాను పార్టీ నేతలకు అందించారు. వరంగల్, హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలుస్తున్నారు.
మహబూబాబాద్ టికెట్ కోసం
లక్ష్మీనారాయణ నాయక్..
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం జనగామకు చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్ వైద్యుడిగా జిల్లా కేంద్రంలో రాణిస్తున్నారు. గ తంలో లక్ష్మీనారాయణనాయక్ సతీమణి ధన్వంతి వ రంగల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యహరించారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న నాయకుడిగా కొనసాగుతున్న డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. జిల్లా ఉద్యమ జే ఏసీ నాయకుడిగా ఉన్న లక్షీనారాయణ నాయక్‌కు ప్రజల్లో మంచి పట్టు ఉంది. రాబోయే పార్లమెంటు ఎ న్నికల్లో ఎస్టీకి రిజర్వుడ్ అయిన మహబూబాబాద్ స్థా నం నుంచి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు డాక్టర్లు వరంగల్, మహబూబాబాద్ స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు.
బీజేపీలో కన్పించని సందడి..
ఒకవైపు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం సందడి కనిపించడం లేదు. జనగా మ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండగా స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి ని యోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. శాసన సభ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం దక్కలేదు. అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేదు. ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో ఆశావహులు ముందుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment