న్యూఢిల్లీ: దేశ ఎన్నికల వ్యవస్థలో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలవుతుందని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్నారు. రిమోట్ ఓటింగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా చెప్పారు. రిమోట్ ఓటింగ్ అంటే ఆన్‌లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు రేఖ వస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపవలసి ఉందని అన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్‌చైన్’’టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ–వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్ లిస్ట్‌లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ డివైస్‌లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు.
(చదవండి: ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక)
Comments
Please login to add a commentAdd a comment