బర్రెలక్క(శిరీష).. ఆమె ఓ సోషల్ మీడియాలో సంచలనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు సైతం ఆమె ముచ్చెమటలు పట్టించారు. శిరీషకు వచ్చిన ప్రచారాన్ని చూసి ఆమె గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. ఒకవైపు ప్రశంసలు.. మరొకవైపు విమర్శల నడమ ఆమె పోటీకి సై అన్నారు.
వెనక్కి తగ్గమని బెదిరింపులు.. బుజ్జగింపుల పర్వం కొనసాగినా చివరి వరకూ పోటీలోనే ఉంటానని చెప్పి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శిరీష. అయితే ఇక్కడ బర్రెలక్క అనబడే శిరీష ఓడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాలుకల్లో ఉండిపోయేంత ఆదరణను చూరగొంది. అదే ఇప్పుడు ఆమెకు కొండంత బలంలా పని చేస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రెడీ అంటోంది.
నాల్గో స్థానమే.. కానీ ప్రతీ నోట బర్రెలక్క మాటే..!
ఆమె పోటీ చేసిన కొల్లపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన శిరీషకు మొత్తం 5,598 ఓట్లు వచ్చాయి. కానీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయి? కొల్లపూర్‌లో పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడిచింది. ప్రధానంగా బర్రెలక్క ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం కూడా జనం నోళ్లల్లో ఎక్కవగా నానింది. చివరకు పరాజయం చవిచూసినా ఒక సామాన్యురాలు.. ఆ మాత్రం ముందుకు వెళ్లడమే చాలా గొప్ప విషయమంటూ పొగిడిన నోళ్లు ఎన్నో..
నాకు ప్రచారానికి టైమ్ సరిపోలేదు..
ఫలితాల అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. తాను ప్రచారం ఎక్కువ రోజులు చేయలేకపోయానని, వారం రోజులు మాత్రమే తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేసినట్లు చెప్పారు. తాను ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదానినని ఆమె పేర్కొంది.
ప్రజలు ఎవరినీ తొందరగా నమ్మరని, తనది చిన్న వయసు కావున.. ఎలా పాలిస్తుందని అనుకున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను ఓడిపోలేదని ప్రజల మనసు గెలిచానని తెలిపారు. కొందరు తనకు ఓటు వేయకూడదని ఓటర్లను బెదిరించారని చెప్పారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచలేదని.. తనకు వచ్చిన ఓట్లు స్వచ్ఛమైనవని, ఈ రకంగా తాను గెలిచినట్లేని చెప్పారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, మద్దతుగా నిలిచిన మేధావులకు, సోషల్ మీడియా మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అందరిలో ఆసక్తి
ఓట్లు విషయంలో ఆమె అందరిలో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. గెలవకపోయినా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన మార్క్ చూపుతుందని ఆమె మద్దతుదారులు ఆశించారు. ఆమె ప్రచారం కోసం పలు సంఘాల నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్లు, న్యాయవాదులు, టీచర్లు, ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు.. ఆమె సైతం ఎవరికీ భయపడకుండా.. ఒక వైపు తన సోదరుడి మీద దాడి జరిగినా ప్రచారంలో ముందుకు వెళ్లింది.
ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లను పక్కన పెట్టి.. అసలు పోటీ చేయడమే గొప్ప విషయమని, నిరుద్యోగుల పక్షాన పోరాటం అపొద్దని నెటిజన్లు కోరుతున్నారు. పోటీలో గెలవకపోయినా శిరీష తొలి అడుగును, ప్రచారంలో ఆమె చూపిన ధైర్యాన్ని అన్ని వర్గాలు వారు అభినందిస్తున్నారు. బర్రెలక్క బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment