సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అధికార కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చడంతోపాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి విజయం సాధించడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, హైదరాబాద్ పరిసరాల్లోని పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని... వారిలో 7–8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేతో కూడా చర్చలు పురోగతిలో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవులు, ప్రలోభాలు, వ్యాపార అవసరాల ప్రాతిపదికన బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటం, ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్‡్షను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం చేయడంపై టీపీసీసీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తద్వారా తాము నిలబెట్టే మూడో అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందనే భావనను ప్రజల్లో కలిగించొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలంతా తమ మూడో అభ్యర్థికి ఓటు వేయడం వరకే పరిమితం కావాలని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకొనే అంశంపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఏఐసీసీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, ఏఐసీసీ అనుమతి మేరకే మూడో అభ్యర్థిని రంగంలోకి దింపుతామని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మరో ముగ్గురు.... నలుగురు
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఇంకెందరు బీఆర్‌ఎస్ ఎంపీలు, పార్టీ మారుతారోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏకంగా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో ఈ చర్చ ఊపందుకుంది. గాంధీ భవన్ వర్గాల సమాచారం ప్రకారం మరో ముగ్గురు, నలుగురు బీఆర్‌ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఎస్సీ రిజర్వుడ్, ఇద్దరు జనరల్ స్థానాల నుంచి గెలిచారని, వారు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
అయితే వారి చేరిక విషయంలో టికెట్ల కేటాయింపు అంశం కొంత అడ్డంకిగా మారిందని, ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోకి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇంకో ఎంపీ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికల కంటే ముందే మరో ఇద్దరు లేదా ముగ్గురు బీఆర్‌ఎస్ ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
వెంకటేశ్ నేతకు తిరిగి ఎంపీ సీటు ఇవ్వొచ్చనే చర్చ
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకొనేందుకు సీఎం రేవంత్ సైలంట్ ఆపరేషన్ నడిపించారని, అనేక సమీకరణాల నేపథ్యంలో వెంకటేశ్ నేత చేరిక అంశం కార్యరూపం దాల్చిందని తెలుస్తోంది. వాస్తవానికి పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.
అయితే ఎంపీ టికెట్ వంశీకి ఇవ్వలేకపోతే రాష్ట్ర కేబినెట్‌లో వివేక్‌కు స్థానం కల్పిస్తారని, వెంకటేశ్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు టికెట్ వంశీకి లేదా పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మరో నేతకు ఇస్తారని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రభావిత స్థాయిలో ఓట్లున్న సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి వెంకటేశ్‌ను పార్టీలో చేర్చుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం!
Published Wed, Feb 7 2024 1:00 AM | Last Updated on Wed, Feb 7 2024 1:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment