‘పార్లమెంట్‌’ హీట్‌! బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు.. | - | Sakshi
Sakshi News home page

‘పార్లమెంట్‌’ హీట్‌! బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు..

Published Mon, Jan 8 2024 11:42 PM | Last Updated on Tue, Jan 9 2024 1:26 PM

- - Sakshi

కరీంనగర్‌: లోక్‌సభ సమరానికి రాజకీయ పార్టీలు సైఅంటున్నాయి. విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్‌ లోక్‌సభ సీటును కై వసం చేసుకోవాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్‌, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో సభలు.. సమావేశాలకు రెడీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ, హుస్నాబాద్‌, చొప్పదండి, మానకొండూర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయబావుట ఎగురవేసింది. కరీంనగర్‌, హుజూరాబాద్‌, సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కరీంనగర్‌, హుజూరా బాద్‌లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు.

ప్రజాక్షేత్రంలోకి బీజేపీ..
బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌కుమా ర్‌ తిరిగి పోటీ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ శ్రేణులు ఇప్పటికే పలుచోట్ల వాల్‌రైటింగ్‌, పోస్టర్లు వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నా రు. గతనెల చివరి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో అమిత్‌షా సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్‌ క్యాడర్‌ను కదనరంగంలోకి దించారు. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రజ ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శక్తికేంద్రాల ఇన్‌చార్జిలను ట్రైనప్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. వికసిత్‌ భారత్‌తో ప్రజలతో మమే కం అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, సీనియర్‌ బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో జరిగే ‘వికసిత్‌ భారత్‌’లో పాల్గొననున్నారు.

జోష్‌లో ‘కాంగ్రెస్‌’..
పదేళ్ల తర్వాత అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్‌ ఊపుతో ముందుకెళ్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఉత్సాహంతో పార్లమెంట్‌ సీటునూ గెలుచుకోవాలని చూస్తోంది. హుస్నాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ మంత్రిగా ఉండటం, గతంలో కరీంనగర్‌ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో అధిష్టానం లోక్‌సభ ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో ఆ పార్టీ లీడర్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఎదుర్కొనేందుకు క్యాడర్‌ను రెడీచేస్తున్నా రు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు బిజీబిజీగా ఉన్నారు.

గత అభివృద్ధి, కాంగ్రెస్‌ హమీలపై ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌..
పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలు తదితరాలు ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన మూడు సీట్లతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశం నిర్వహించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ఇవి చదవండి: నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్‌యాదవ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement