అప్రమత్తమైన రాజకీయ పార్టీలు
మల్కాజిగిరిలో బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు
బీజేపీ అభ్యర్థి ఈటల దూకుడు
ఇప్పటికే మోదీ రోడ్ షో, అమిత్‌షాతో సమావేశం
అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు
నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం
తెరపైకి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పేరు
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది.
శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు.
ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్‌లో 7,12,756, కూకట్‌పల్లిలో4,71,878, ఉప్పల్‌లో 5,33,544, ఎల్బీనగర్‌లో 6,00,552, కంట్మోనెంట్‌లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
పార్టీలు అప్రమత్తం
మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.
కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
బీజేపీలో అసమ్మతిపై దృష్టి
బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment