
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలై ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అనుకున్న దాని కంటే ముందే ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు క్యాడర్‌ను సంసిద్ధం చేసే పనిపై దృష్టిపెట్టంది.
కొత్త సంవత్సరంలో జనవరి 3 వ తేదీ నుంచి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహించనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల షెడ్యూల్‌ను పార్టీ శుక్రవారం ప్రకటించింది.
3వ తేదీన ఆదిలాబాద్ 4న కరీంనగర్, 5 చేవెళ్ల, 6 పెద్దపల్లి, 7 నిజామాబాద్, 8 జహీరాబాద్, 9 ఖమ్మం,10 వరంగల్,11 మహబూబాబాద్, 12 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు, సంక్రాంతి అనంతరం 16న నల్గొండ, 17న నాగర్ కర్నూలు, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో గులాబీ నేతలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకొని ఆ తప్పులు మళ్లీ జరగకుండా ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు అవలంబించాల్సిన కార్యాచరణను నిర్ణయించనున్నారు.