సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు.
జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు.
కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్‌ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్
Comments
Please login to add a commentAdd a comment