
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చేందుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశమున్నందున, కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు.
పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్‌లోపే ఆరు గ్యారంటీలలోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయని హరీశ్ పేర్కొన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చి మార్చి 17వ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినప్పటికీ, ఎన్నికల కోడ్‌వస్తే గ్యారంటీల అమలుకు బ్రేక్‌పడే ప్రమాదముందన్నారు.
ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఫిబ్రవరి 20లోపే చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌షెడ్యూల్‌వచ్చేలోపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్‌ప్రవేశపెట్టాలని, ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌కాకుండా ఓట్‌ఆన్‌ఎకౌంట్‌బడ్జెట్‌పెట్టిందంటే హామీల అమలు ఎగవేతకు సిద్ధమైనట్టేనని అనుమానించాల్సి ఉంటుందన్నారు. అలాగే యాసంగి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ఇచ్చే పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌కూడా వెంటనే రిలీజ్‌చేసి, బడ్జెట్లో ఆ స్కీంను చేర్చాలని చెప్పారు.
ఆ దరఖాస్తులు కాలయాపనకేనా?
పథకాల అమలుకు ప్రభుత్వం ముందుగా విధివిధానాలు రూపొందించి, తరువాత ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని, కానీ కాంగ్రెస్‌ప్రభుత్వం గైడ్ లైన్స్‌సంగతి తర్వాత.. ముందైతే దరఖాస్తులు తీసుకుందామన్నట్టు వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. అందుకే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటున్నారని, వాటిని ఆన్‌లైన్ చేయడం పేరుతో ఆయా స్కీంల అమలును వీలైనంత జాప్యం చేయాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
తమ ప్రభుత్వంలో ఏ రోజు ఎంతమంది రైతులకు రైతుబంధు ఇచ్చామో ప్రతి రోజూ ప్రెస్‌నోట్‌ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఎందరికి రైతుబంధు ఇచ్చారో క్లారిటీ లేదని తెలిపారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టిన వారికి, ఎందరికి రైతుబంధు ఇచ్చారనే వివరాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి అమలును ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తాము ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడమే దీనికి నిదర్శమన్నారు.
డిసెంబర్9వ తేదీనే రైతు భరోసా, రూ.2 లక్షల రుణాలు మాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200లోపు యూనిట్ల కరెంట్‌బిల్లులు మాఫీ హామీలు ఇచ్చారని, వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌సహా పెద్ద జబ్బులకు వైద్యం చేసేందుకు తమ ప్రభుత్వం రూ.11.50 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద చెల్లించిందని, కొత్త ప్రభుత్వంలో ఈ స్కీం ఎంతమందికి వర్తింపజేశారనే వివరాలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.
హామీలిచ్చేటప్పుడు బడ్జెట్‌పై అవగాహన లేదా?
మాటకు ముందు అప్పులు, ఖాళీ కుండలు అని చెప్పేవాళ్లకు ... హామీలిచ్చేటప్పుడు బడ్జెట్‌పై అవగాహన లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,400 కోట్ల అప్పు చేసినట్లు తెలిసిందని, రూ. 13వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆర్‌బీఐకి లేఖ రాసిందని, ఈ అప్పులను కూడా శ్వేతపత్రంలో తమ ప్రభుత్వం ఖాతాలోనే వేశారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలకు ముందు జాబ్‌క్యాలెండర్‌పేరుతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందని, దానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించాలని సూచించారు.
కార్లు కొని దాచిపెట్టుకున్నట్టు మాట్లాడి ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకోవద్దన్నారు. ప్రగతిభవన్‌లో 200 రూములు, స్విమ్మింగ్‌పూల్, బుల్లెట్‌ప్రూఫ్‌బాత్రూంలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని, ఇప్పుడు అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఏది నిజమో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రొటోకాల్‌ఉల్లంఘన జరుగుతోందని, నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్‌నేతలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 119 మంది ఎమ్మెల్యేలను సమదృష్టితో చూస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ప్రస్తుతం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.