చేవెళ్ల, నల్లగొండ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
చేవెళ్ల అభ్యర్థిగా కాసాని.. నల్లగొండ అభ్యర్థిగా కృష్ణారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: పదవుల కోసం పార్టీలు మారే వారికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొందరు నేతలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని చూసి పార్టీని నమ్ముకున్న నేతలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని సూచించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. సోమవారం నందినగర్ నివాసంలో నల్లగొండ, చేవెళ్ల బీఆర్‌ఎస్ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
చెరువు నిండినపుడు కప్పలు చేరినట్లు, అధికారం ఉన్న చోటకు వలసలు సహజమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం బీఆర్‌ఎస్‌కే మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, అన్ని స్థాయిల్లో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.
చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్!
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గం పరిధిలోని కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ధీటైన అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు.
త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
రంజిత్‌రెడ్డి, గుత్తా అమిత్ దూరం
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి సోమవారం నాటి భేటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీకి సిద్ధంగా లేనని కొద్ది రోజుల క్రితం రంజిత్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరోవైపు మొన్నటివరకు నల్లగొండ, భువనగిరిలో ఏదో ఒకచోట నుంచి టికెట్ ఆశించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన భేటీకి హాజరు కాలేదు.
టికెట్ రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన కూడా వారం క్రితమే పార్టీ అధినేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో త్వరలో పార్టీ కొత్త ఇన్‌చార్జిని ప్రకటిస్తామని..తెలంగాణ భవన్‌లో తనను కలిసిన ఆ నియోజకవర్గ నేతలకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.
రెండు మూడురోజుల్లో రెండో జాబితా?
బీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్న కేసీఆర్ రెండు మూడురోజుల్లో రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ (కరీంనగర్), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.
తాజాగా గాలి అనిల్‌కుమార్ (జహీరాబాద్), కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల) పేర్లపై దాదాపుగా స్పష్టత వచ్చింది. బీఎస్‌పీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నాగర్‌కర్నూలు కేటాయించే అవకాశముంది. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థుల విషయంలో మాత్రం చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. గిరిజనులు ఎక్కువగా ఉండే హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు కోరారు. అయితే కేసీఆర్ ప్రస్తుతానికి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌కు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కాగా త్వరలో పార్టీ ఇన్‌చార్జిని ప్రకటిస్తామని జగదీశ్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment