
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార‌్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment