సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం(జనవరి19) కిషన్‌రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలు చూస్తున్నాం. రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. రెండు పార్టీలు బొమ్మ బొరుసులా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నాయి. నగరంలో వీధి లైట్లు వెలగలేక వెలవెల పోతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా మళ్లించడం ద్వారా లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇచ్చేదిలేదని చెబుతున్నాయి.
బీజేపీపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు లేదు.తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి ఈ రెండు పార్టీలే కారణం.ఒక్క అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారు.తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు,విష ప్రచారాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది,అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ.రాజ్యాంగంపై అనేక కుట్రలు చేసి,అంబేద్కర్‌ను ఆనేక రకాలుగా అవహేళన చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ.పంచతీర్థ పేరుతో అంబేద్కర్‌ను సగౌరవంగా గౌరవించిన పార్టీ బీజేపీ.
తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నాం. ఇంటింటికి వెళ్తాం. రాజ్యాంగంపై కాంగ్రెస్ చేసిన అవహేళన చరిత్రను ప్రజలకు తెలియజేస్తాం.రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయట పెడతాం.సేవ్ తెలంగాణ పేరుతో యువత ముందుకు రావాలి’అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment