సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనని తప్పుడు ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం(జులై 12) జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
‘లోక్ సభ ఎన్నికల్లో అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు వందల రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదు.
అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్‌ఎస్ తరహాలోనే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. తెలంగాణను దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి డబ్బులు పంపిస్తోంది. పాంచ్ న్యాయం పేరిట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని మేనిఫెస్టోలో పెట్టారు. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ఎప్పుడు లేనంతగా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. పదేళ్ల పాటు అధికారంలో అన్న బీఆర్‌ఎస్ ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 44 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది ఒకటే డీఎన్‌ఏ. నాణేనికి బొమ్మ, బొరుసులలా రెండూ అవినీతి పార్టీలే. మజ్లీస్ పార్టీ నేతలు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు లేదు. ఎంఐఎం అధినేత పార్లమెంట్‌లో జై భారత్ మాతా అనకుండా.. జై పాలస్తీనా అనడం సిగ్గు చేటు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతోంది. నీళ్ళు ఏవో... పాలు ఏవో .. ప్రజలు అర్థం చేసుకోవాలి’అని కిషన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment