తమిళనాడులో 42 మంది నేతలపై ఈసీ వేటు
ఖర్చులు సక్రమంగా చూపనందుకు ఎన్నికల్లో పోటీకి మూడేళ్ల నిషేధం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వివిధ పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులపై ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలు సక్రమంగా చూపని వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2011రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 10 మంది అభ్యర్థులు, 2014 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 32 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు సక్రమంగా చూపలేదని పేర్కొంటూ మొత్తం 42 మందిపై నిషేధం విధించింది. ఈ 42 మంది మరో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ సోమవారం ప్రకటించారు.